– విశిష్ఠ ప్రణాళికను ప్రజల ముందుంచినందుకు ధన్యవాదాలు
– తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత గైర్హాజరు శోచనీయం
– సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి
– నవశకానికి నాంది పలకాల్సిన సమయం
– రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించుకున్నాం
– శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్‌ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రాత్మకం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కావు.. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని చెప్పారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళికను పవిత్ర శాసన సభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందుంచిన గవర్నర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని అనుకున్నాం.. కొత్త గవర్నర్‌కు శుభాకాంక్షలు చెబుతారని భావించాం.. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా కొందరిలో రాచరికపు పోకడలు మాత్రం పోలేదన్నారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారన్నారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు.. ప్రజలే తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి ప్రదర్శించారు.. ప్రజలు బుద్ధిచెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇప్పుడూ అదే తీరుగా ప్రవర్తిస్తున్నారు.. అంటూ వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 1 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రూ.కోటి 6 లక్షల 56 వేల 674లు జీతభత్యాలు పొందారని, విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు.
నవశకానికి నాంది పలకాల్సిన సమయమిది
గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలని గవర్నర్ ప్రసంగంలో వివరించారన్నారు. సంక్షోభ సమయంలో దేశ ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టారని, ఆయన తీసుకున్న ప్రణాళికలతోనే ఇవాళ దేశం ఈ పరిస్థితుల్లో ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మొదటి తరంలో నెహ్రూ- ఇందిరా గాంధీ గొప్ప విధానాలు తీసుకువచ్చారన్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్ధిక గతిని మార్చిన ఘనత పీవీ నరసింహారావుదని గుర్తు చేశారు. 1990 నుంచి 2020 వరకు 30 ఏండ్లు పీవీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కాగా, భవిష్యత్తులో ఏఐ సునామీ రాబోతోందని, దీనిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనే ఒక పాలసీ డాక్యుమెంట్‌ను గవర్నర్ ప్రసంగంలో వివరించారన్నారు. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను కనీసం చదివారా? చూశారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవన్నారు. ఇది నవశకానికి నాంది పలకాల్సిన సమయమని, అధికారం కోల్పోయామన్న దుఃఖమే తప్ప ప్రభుత్వానికి సహకరించాలన్న ఆలోచన ప్రధాన ప్రతిపక్షానికి లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఎవరు అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకున్నాం.. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించుకున్నాం అని వివరించారు. గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన మాటలను సీఎం రేవంత్ సభకు వినిపించారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమం అని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది అని నిలదీశారు. మీరు మాట్లాడిన మాటలను ప్రజలు మర్చిపోయారనుకున్నారా అని ప్రశ్నించారు. మూసీ ఉప్పల్ భగాయత్‌లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూసొద్దాం రండి.. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం అని సీఎం అన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని, త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామని చెప్పారు. మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, చెరువులను పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 నుంచి ఇప్పటివరకు ‘హిల్ట’ పాలసీ సహా దర్యాప్తునకు సిద్ధం. దీనిపై ఏ విచారణ కావాలో ప్రతిపక్ష నాయకులు లేఖ ఇవ్వండి. టీడీఆర్ పాలసీపై కూడా విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎంక్వయిరీకి వెనకాడితే, వెనక్కి తగ్గితే క్షమాపణ చెబుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





