ఘన స్వాగతం పలికిన ఇన్‌చార్జి మంత్రి పొన్నం
సికింద్రాబాద్, ప్రజాతంత్ర, జులై 11: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి చరిత్రను పూజారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి ఘన స్వాగతం పలికి వారితోపాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, గత నెల 26న గోల్కొండ జగదాంబ తొలి బోనాలు ప్రారంభమైనాయని, జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జరిగిందని తెలిపారు. 13వ తేదీ జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లష్కర్ బోనం సమర్పిస్తారని, 14న భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ, పోలీస్, జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు.





