మాన‌వ జ్ఞానాన్ని ప్ర‌భావితం చేస్తున్న ఏఐ

– మాన‌వ విచక్ష‌ణ‌, క‌రుణ‌కు ఏఐ ప్ర‌త్యామ్నాయం కాదు
– మార్పుల‌కు అనుగుణంగా యువ‌త ఎద‌గాలి
– విద్య ల‌క్ష్యం స‌మాజ హితం కావాలి
– గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: ఏఐ ఇక భవిష్యత్తు కల కాదని, ఇది విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలు, మానవ జ్ఞానాన్ని ప్రభావితం చేస్తోందని, తద్వారా విద్య కేవలం ఉద్యోగాల కోసం కాక మార్పులకనుగుణంగా ఎదగగల సామర్థ్యం, జీవితాంతం నేర్చుకునే దృక్పథాన్ని యువత అలవరచుకోవాలని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అన్నారు. ఏఐ డేటాను విశ్లేషించగలదు.. నిర్ణయాలు తీసుకోగలదు.. కానీ మానవ విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు అది ప్రత్యామ్నాయం కాదన్నారు. విద్య లక్ష్యం యంత్రాలతో పోటీపడడం కాక సమాజ హితానికి సాంకేతికతను దారి చూపగల మానవ విలువలను బలోపేతం చేయడం ఎంతో అవసరమని అన్నారు. బిట్స్ పిలానీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ‘బిట్స్  గ్లోబల్ మీట్స్ (బీజీఎం26) ఆరో ఎడిషన్ ను హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఆయ‌న శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బిట్స్ పిలానీ విద్యా ప్రతిభకుమాత్రమే పరిమితం కాదని, తరతరాలుగా నూతన ఆవిష్కరణలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, భయంలేని జిజ్ఞాసను పెంపొందిస్తూ వస్తోందని అన్నారు. నేడు విద్య ఒక కీలక మలుపుతో కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సైన్స్, ఆటోమేషన్, డిజిటల్ మార్పులు విద్యా వ్యవస్థను మౌలికంగా మలుస్తున్నాయి. బిట్స్ పిలానీ ఈ ఆలోచనను విద్యా స్వయం ప్రతిపత్తి, అనువైన పాఠ్య ప్రణాళికలు, అంతరశాఖీయ అధ్యయనం, ప్రాయోగిక విద్య ద్వారా సాకారం చేస్తోందని శ్లాఘించారు.

రాష్ట్ర సాంకేతిక వ్యవస్థతో అనుసంధానమై, ఆధునిక పదార్థాలు, బయోటెక్నాలజీ, వాతావరణ పరిష్కారాలు, రోబోటిక్స్, ఏఐ వంటి రంగాల్లో విశిష్టంగా ఎదుగుతోంద‌ని అన్నారు. ఇలాంటి కేంద్రాలు దేశాన్ని కేవలం సాంకేతిక వినియోగదారుడిగా కాక స్థానిక అవసరాలకనుగుణమైన ఆవిష్కరణల సృష్టికర్తగా నిలుపుతున్నాయన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులనుద్దేశించి మాట్లాడతూ బిట్స్ పిలానీ విశిష్ట పూర్వ విద్యార్థులకు అభినందనలు. వారి విజయాలే సంస్థ వారసత్వానికి ప్రతీకలన్నారు. మీ విజయాలు భారతీయ విలువలతో కూడిన ఆవిష్కరణలకు ప్రేరణగా నిలుస్తున్నాయని, వృత్తి నైపుణ్య శిక్షణ, స్వావలంబన పరిశ్రమలు, ప్రతిభ పెంపకంలో మీ సహకారం కోసం దేశం ఆశగా ఎదురు చూస్తోందని అన్నారు. యువతకు మార్గదర్శకులుగా నిలిచి, సమాజాన్ని ఉద్ధరించి, జాతీయ స్వయం సమృద్ధిని ముందుకు నడిపించండడంలో మీ వంతు సహాకారాన్ని అందించాలన్నారు. కార్మిక, ఉపాధి, శిక్షణ- కర్మాగారాల (లెట్‌&ఎఫ్‌) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీదాన కిశోర్ మాట్లాడుతూ సాంకేతికత మరియు నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్,  నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వామిగా ఎలా సహకరిస్తున్నాయో వివరించారు. బీజీఎం 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు మాట్లాడుతూ, ఈ సదస్సు వివిధ తరాల మధ్య సహకారానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మొదటి రోజు ముగింపులో ఇన్‌స్టిట్యూట్ వారసత్వాన్ని, స్నేహాన్ని చాటిచెప్పే సంప్రదాయ ఖవ్వాలీ ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. అంత‌కుముందు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి గవర్నర్ కు పుష్ఫగుచ్చం అందించి స్వాగతం పలికారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎఫ్ఏసీ), బీజీఎం 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు, బిట్స్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.రామగోపాల్ రావు, ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎంజెల్ ఇన్వెస్టర్ కన్వల్ రేఖి, బీజీఎం 2026 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మయూర్ పట్నాలా తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *