జూబ్లీహిల్స్‌ అభివృద్ధి పట్టని ప్రభుత్వాలు

– ఇందులో గత బీఆర్‌ఎస్‌ పాత్రా ఉంది
– హామీలపై ప్రచారంలో స్పష్టత ఇవ్వని కాంగ్రెస్‌
– సన్న బియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదే
– ముస్లింలు కాంగ్రెస్‌కు ఇజ్జత్‌ అయితే.. మరి హిందువులో..
– ‘మీట్‌ ద ప్రెస్‌’లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, కనీసం గ్రామస్థాయిలో జరిగే అభివృద్ధి కూడా లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ నియోజకవర్గం వెనుకబాటుకు గతంలో పాలించిన బీఆర్‌ఎస్‌ కూడా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీకి వోటు వేయాలనే దానిపై వోటర్లు ఇంకా నిర్ణయానికి రాలేదని, అందుకే సర్వేల్లో కూడా స్పష్టత లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రచారంలో 6 గ్యారంటీలను గానీ, 400 పైచిలుకు హామీల గురించి గానీ ప్రస్తావించడం లేదని, వ్యక్తిగత విమర్శలు చేయడంపైనే దృష్టి పెడుతోందని దుయ్యబట్టారు. గ్యారెంటీలపై స్పష్టత ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘ముస్లింలు కాంగ్రెస్‌ పార్టీకి ఇజ్జత్‌ అంటావు.. మరి హిందువులు ఇజ్జత్‌ కాదా మిస్టర్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హిందువులకు గౌరవం లేదా.. ఎర్రగడ్డలో ఖబరస్థాన్‌ కోసం స్థలమిచ్చేందుకు మనసొచ్చింది కానీ బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఇవ్వడం ఎందుకు కుదరలేదు’ అని నిలదీశారు. హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవు.. ఎన్నాళ్లు మజ్లిస్‌ను భుజాన ఎక్కించుకుని తిరుగుతావో తిరుగు.. ప్రజలే నీకు గట్టి బుద్ధి చెబుతారు అని వ్యాఖ్యానించారు. వోటు వేయకపోతే సన్న బియ్యం, ఫ్రీ బస్‌ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. బియ్యంలో మెజారిటీ వాటా కేంద్రానిదేనంటూ దీనికి సంబంధించి ఒక పోస్టును తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పెట్టారు. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలి అని నిలదీశారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్నదన్నారు.

 వొచ్చే ఏడాది బీబీనగర్‌ ఎయిమ్స్‌ భవనాలు  ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వొచ్చిన నిధులను, వొచ్చిన సంస్థల వివరాలు కిషన్‌రెడ్డి వివరించారు. వొచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బీబీనగర్‌ ఎయిమ్స్‌ భవనాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతాయని వెల్లడిరచారు. 200 బస్తీ దవాఖానలు కేంద్రం సహకారంతో నడుస్తున్నాయని, కేసీఆర్‌ వాటి పేరు మార్చారని అన్నారు. కేంద్రానికి సంబంధించి 101 అభివృద్ధి కార్యక్రమాలు హైద్రాబాద్‌ పరిధిలో జరుగుతున్నాయన్నారు. మెట్రో గురించి కూడా మాట్లాడుతున్నారు.. ఎల్‌అండ్‌టి తాము చేయలేము అంటోంది.. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలి.. కొత్త డీపీిఆర్‌ కేంద్రానికి ఇవ్వాల్సి ఉంది అని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణ బిడ్డగా నా నియోజకవర్గం అభివృద్ధి కోరుకుంటానంటూ రేవంత్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ కోసం మా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించానని, వివిధ అంశాలపై కేసీఆర్‌కు 40 లేఖలు రాసినా స్పందించలేదని చెప్పారు. అలాంటి వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారన్నారు. హైద్రాబాద్‌లో డిఫెన్స్‌ మీద రూ.లక్షా 40 వేల కోట్లు కేంద్రం ఖర్చు పెట్టిందని వెల్లడిరచారు. పత్తి రైతులు ఆందోళన చెందొద్దంటూ మార్చి వరకు పత్తి కొంటామన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా చాలాసార్లు డిపాజిట్‌ రాలేదు.. జూబ్లీహిల్స్‌ ప్రజలు ఎవరికి వోటు వేసేది.. ఎవరికి ఎన్ని వోట్లు వస్తాయో కౌంటింగ్‌ రోజు తెలుస్తుందన్నారు. రేవంత్‌ మాట్లాడుతూ పోతుంటారు.. మనం వింటూ పోవాలి అని వ్యంగ్యంగా అన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరపాలని తాము అడుగుతున్నామని, హైకోర్టులో కేసు నడుస్తోంది.. తాను కూడా దిల్లీతో మాట్లాడతానని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు దిల్లీస్థాయిలో ఒప్పందం జరిగింంటూ రేవంత్‌ను సీఎంగా కొనసాగించాలని రాహుల్‌కు ఇష్టం లేదని కేటీఆర్‌ అంటున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *