– సకాలంలో వడ్డీ లేని రుణాల చెల్లింపు
– ఊరూవాడా ఇందిరా మహిళా శక్తి సంబరాలు
– ఈనెల 18 వరకు నియోజకవర్గాలవారీగా వడ్డీ, బీమా చెక్కుల పంపిణీ
– ప్రజా ప్రభుత్వంలో ఎస్‌హెచ్‌జీలకు నూతనోత్సాహం
హైదరాబాద్, జూలై 13: మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు అండగా ఉంటూ క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో రూ.344 కోట్ల వడ్డీలను విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ ప్రాంతాల మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ సంఘాలకు కేటాయించింది. ఈనెల 18లోగా అన్ని సంఘాల ఖాతాల్లో వడ్డీ రాయితీ నేరుగా జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్డీ రాయితీ చెక్కులతోపాటు ప్రమాద బీమా, రుణ బీమా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం మహిళలకు ఆర్థిక భద్రతను కల్పించే దిశగా మరో కీలక అడుగుగా నిలవనుంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో వడ్డీ లేని రుణాల పథకం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. 2019 నుంచి 2023 మధ్యకాలంలో రూ.3,075 కోట్లకు పైగా వడ్డీ రాయితీలు బకాయిలున్నాయి. మహిళా సాధికారతను పరిగణనలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడు పథకానికి కొత్త శక్తి వచ్చిందని మహిళా సంఘాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతో పథకం మరింత సమర్థవంతంగా అమలవుతోంది. బ్యాంకుల ద్వారా మహిళలు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వమే భరిస్తోంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.518.69 కోట్లు మహిళా సంఘాలకు వడ్డీల రూపంలో ప్రభుత్వం చెల్లించగా ఇప్పుడు తాజాగా మరో రూ.344.35 కోట్లను విడుదల చేసింది. దీంతో మహిళా సంఘాలకు మొత్తం రూ.862.04 కోట్లు విడుదల చేసినట్లయింది. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు చెక్కుల రూపంలో వడ్డీలను ప్రభుత్వం చెల్లించనుంది. ప్రజా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత సకాలంలో నిధులు జమ అవుతుండటం మంత్రి సీతక్క పనితీరుకు నిదర్శనమని, కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రతీక అని సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఏటా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా రుణాలను మహిళా సంఘాలకు సమకూరుస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీల భారం లేకుండా వారి తరఫున ప్రభుత్వమే వడ్డీలను చెల్లిస్తుందని స్పష్టం చేశారు.


