రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించ‌ని ప్ర‌భుత్వం

– అయోమ‌యంలో 14వేల‌మంది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు
– ఇచ్చిన హామీల‌ను మ‌ర‌చిన ముఖ్య‌మంత్రి
– దారిమ‌ళ్లుతున్న జీపీఎఫ్ నిధులు
– ఇప్ప‌టికైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి
– రిటైర్డ్ ఉద్యోగుల ఆవేద‌న‌

 

                          ప్ర‌జాతంత్ర‌, న్యూస్‌నెట్‌వ‌ర్క్‌

ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం. ప్రభుత్వ పాలన సక్రమంగా నిర్వహించాలంటే ఉద్యోగుల పాత్ర ఎంతగానో దోహదపడుతుంది.  వీరు సక్రమంగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తదనుగుణంగా ఉద్యోగులకు సకాలంలో చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, ఉద్యోగుల జీవన ప్రమాణాలకు అనుగుణంగా, నిత్యావసర ధరల పెరుగుదల సూచీకనుగుణంగా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒక డి. ఎ. కరువు భత్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 2023 జూలై వరకు మూడు కరువు భత్యాల వాయిదాలు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డి. ఏ. లను తక్షణం చెల్లిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటవ తారీఖున వేతనాలు చెల్లిస్తామని,. సప్లిమెంటరీ బిల్లులను 15 పని దినములలో చెల్లిస్తామ‌ని, ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలుపరుస్తామ‌ని, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇచ్చే డి.ఎ. ను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగస్తులకు చెల్లిస్తామని హామీలు ఇచ్చారు. అంతేకాదు  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కొత్త పీఆర్సి ని ప్రకటించి, ఆరు నెలల లోపు సిఫారసులను అమలు చేస్తామన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో, వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. కెసిఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి ఇచ్చిన‌ హామీల పట్ల విశ్వాసంతో ప్రజలు మీ పార్టీకి సానుకూలంగా ఉండడం వల్లనే మీరు అధికారంలోకి రాగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఓట్లే కీలకమ‌నేది బహిరంగ రహస్యం. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతకాలం ఓపిక పట్టాం. కానీ ముఖ్య‌మంత్రి, దేశంలో నాకు అప్పులు ఎవరు ఇవ్వడం లేదు. నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు. నేను ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగులకు,పెన్షనర్లకు ఇమ్మంటార‌ని ఎదురు ప్ర‌శ్న వేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఆయ‌న మాట్లాడాల్సినటువంటి మాటలు కావు.మీ హుందాతనానికి, ముఖ్యమంత్రి హోదాలో ఈ మాటలు మాట్లాడడం సరియైనవి కావు. పైసలు లేవంటూనే మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైనా ఆపగలుగుతు న్నారా? అవన్నీ అమలు చేసుకుంటున్నారు కదా! అదేవిధంగా ముఖ్యంగా  రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వవలసిన రిటైర్మెంట్ బకాయిలు అందులో మేము దాచుకున్న జిపిఎఫ్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మా జిపిఎఫ్ నిధులను దారి మళ్లిస్తున్నారు. సి.ఏ.జి. రిపోర్టు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు ఎప్పుడో కేటాయించారు కదా?మరి ఆ నిధులు ఎందుకు వివిధ పథకాలకు వెచ్చిస్తున్నారు?. నన్ను కోసినా డబ్బులు లేవంటూనే మీరు ప్రపంచ సుందరీ మణుల పోటీలకు రూ.500 కోట్లు వెచ్చించడం, గ్లోబల్ సమ్మిట్ కు రూ. 200 కోట్లు వెచ్చించడము,మెసీ ఫుట్బాల్ పోటీలకు వంద కోట్లు, మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? మరి ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ కు వీటన్నింటికీ డబ్బులు రాగా! కేవలం రిటైర‌యిన‌ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన బకాయిలు కేవలం ఏడు, ఎనిమిది వేల కోట్లు లేవని అంటున్నారు?   ఈ వైఖ‌రిని 14 వేల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. మిమ్మ‌ల్ని కొత్తగా మేము కోరికలు కోరడం లేదు. ఎలాంటి ఉచితాలు అడగడం లేదు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మరియు మాకు రావలసిన రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. “మీరు అధికారంలోకి వస్తే మీరు అమలు చేస్తానన్న హామీలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి”. వాటిలో కేవలం ఒకే ఒక్క హామీ మాత్రమే నెరవేరినది. అది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒకటవ తారీఖున వేతనాలు మాత్రం చెల్లిస్తున్నారు. దానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కానీ మిగతా హామీల సంగతి ఏమిటి? మీరు అధికారంలోకి వస్తే, ఒకేసారి అప్పుడు బకాయి పడి ఉన్న మూడు విడతల డీ.ఏ.లను వెంటనే చెల్లిస్తామన్నారు. ఆ డి. ఏ. లు ఇప్పటికి ఆరు విడతల డి.ఏ.లు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా పీఆర్సి రిపోర్టు తెప్పించుకొని, ఆరు నెలల లోపు పిఆర్సి సిఫార్సులను అమలు చేస్తామన్నారు. అది అమలు చేశారా? 2023 జూలై వరకే పిఆర్సి గడువు అయిపోయినది. పిఆర్సి గడువు కూడా అయిపోయి రెండు సంవత్సరాల‌ 6 నెలలు కావస్తున్నది. అయినప్పటికీ రిపోర్టు సబ్మిట్ చేయలేదు, దాన్ని అమలు చేసే దిశగా ఏమాత్రం మీరు చొరవ చూపడం లేదు. ఇది ఉద్యోగులను, పెన్షనర్లను వంచించడం కాదా? ఉద్యోగుల‌కు అన్ని ఆసుపత్రులలో నగదు రహిత వైద్యము అందిస్తామని అందుకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని, హామీ ఇచ్చారు కానీ రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా హెల్త్ కార్డ్స్ జారీ చేయకపోవడం ఉద్యోగుల, పెన్షనర్ల యొక్క ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం శ్రద్ధ లేదని స్ప‌ష్ట‌మైంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల యొక్క ఉద్యోగ విరమణ వయసును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరంలకు మార్చి 2021 నుండి ఫిబ్రవరి 2024 వరకు పెంచారు. మన రాష్ట్రంలో ఉద్యోగ విరమణలు మార్చి 2024 నుండి రిటైర్మెంట్లు ప్రారంభం అయ్యాయి. ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు. 2024 మార్చి నుండి డిసెంబర్ 2025 వరకు దాదాపుగా 14,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు న్యాయంగా రావలసినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఈ.ఎల్. హాప్-పే లీవ్ ఇన్కాష్మెంట్ లీవ్స్, జిపిఎఫ్, టి.ఎస్.జి.ఎల్.ఐ, జిఐఎస్, పీఆర్సి 2020 ఏరియర్స్ మరియు సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్ లీవ్స్ తదితర బిల్లుల మొత్తం రిటైర్ అయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ అయిన వెంటనే చెల్లించాల్సి ఉన్నది. ఒక్కొక్కరికి వారి హోదా, వారి సర్వీస్ ఆధారంగా వారు నిల్వ చేసుకున్నటువంటి జిపిఎఫ్ ల ఆధారంగా ఒక్కొక్కరికి దాదాపుగా 35 లక్షల నుండి 80 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి వుంది.
చాలామంది పెన్షనర్లు రిటైర్మెంట్లు బెనిఫిట్స్ రాకపోవడంతో మానసిక వేదనకు గురి అయి, ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం పాలై వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కొరకు ఆసుపత్రులలో లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నది. అనారోగ్యంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోవడం చాలా బాధాకరం. కొంత మంది ఇప్పటికీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు డబ్బులు లేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు అప్పుల బాధ భరించలేక, మానసిక స్థితి సరిగా లేనందున ఎక్కడికో వెళ్లిపోయాడు, ఇంతవరకు అతని ఆచూకీ లేదు. వీరి మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇకనైనా మానవతా దృక్పథంతో రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బాధలను అర్థం చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన రిటైర్మెంట్ బకాయిలన్నింటిని ఏక మొత్తంలో చెల్లించాలని, రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కుటుంబాల పెన్షనర్లు ప్రాధేయపడుతున్నారు. మేము రిటైర్డ్ అయి 21నెలలు గడిచినా తమకు హక్కుగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం సమయానికి అందించడం లేదంటూ కొంత మంది కోర్టులను కూడా ఆశ్రయించారు. కోర్టులు కూడా పలు ఆదేశాలు జారీ చేశాయి. అయినా ప్రయోజనం లేదు. ఈ సమస్యల పరిష్కారానికి నెలకు 700 కోట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 700 కోట్లలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కేవలం 10 శాతం కూడా చెల్లించడం లేదు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వారి పెండింగ్ బకాయిలు, మరియు జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లకు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం డిసెంబర్లో రూ.713 కోట్లు చెల్లించామని చెప్పినప్పటికీ అవి కూడా 90 శాతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ లు ఉన్నాయి. కేవలం 10 శాతం మాత్రమే రిటైర్డ్ అయిన ఉద్యోగుల జిపిఎఫ్ మాత్రమే ఫిబ్రవరి 2025 వరకు వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ విధంగా చెల్లిస్తున్నట్లయితే ఇంకా రెండు సంవత్సరాలు అయినా డిసెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన వారికి రిటైర్మెంట్ బకాయిలు అన్ని రావు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఏక మొత్తంలో చెల్లించాలని రిటైర్డ్ ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *