– పెండింగ్‌లో 5 డీఏలు
– పీఆర్సీ ఇప్పటివరకు ఇవ్వలేదు
– ఈహెచ్ఎస్ ఇంతవరకు అమలు చేయలేదు
– రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేదు
– ఇప్పటివరకు 39 మంది మనోవేదనతో మరణించారు
– పెండింగ్‌లో పోలీసుల ఐదు సరెండర్ లీవ్‌లు
– స్టేషన్ అలవెన్స్ లు లేవు
– శాసనసభలో హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్లీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందించాలని హరీష్‌రావు అన్నారు. జీరో అవర్‌లో ఆయన సోమవారం శాసనసభలో ప్రసంగిస్తూ గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు పంపించిన సంగతి గుర్తుచేశారు. కొత్త సభ్యులు మాట్లాడుతుంటే జీరో అవర్ కాస్తా అరణ్యరోదనగా మారుతోందన్నారు. అలా మార్చకండి. ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాల వంటి వారు. వాళ్లు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయి. కానీ నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రమైన మనోవేదనలో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదు. వెంటనే విడుదల చేయాలని కోరారు. గతంలో కేసీఆర్ 43 శాతం, 39 శాతం పీఆర్సీ అందించారు. ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ జీవోను కూడా ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఈహెచ్ఎస్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికీ అమలు చేయలేదు. రిటైర్డ్ ఉద్యోగులు 39 మంది ప్రభుత్వ బెనిఫిట్స్ అందక మనోవేదనతో మరణించారు. మా హయాంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే అందరికీ టైంకి డబ్బులు అందించాం. నేను అసెంబ్లీకి వస్తుంటే సిద్దిపేట నుండి రిటైర్డ్ జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి కలిశారు. అక్టోబర్ 2024లో రిటైర్ అయితే ఇప్పటివరకు ఒక్క రూపాయి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో కేసు వేసినా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. 35 ఏళ్లు సేవ చేసిన మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా అతీగతీ లేదన్నారు. సీపీఎస్ కింద ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను రెండేళ్ల నుంచి దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల 2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయి. టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు రావడం లేదు. రాష్ట్రంలో లక్ష మంది పోలీసులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గతంలో మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేసింది. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత స్కీమును బంద్ చేసి, కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేశారు. కానిస్టేబుళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య భద్రత పథకాన్ని పునరుద్ధరించి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం అందేలా చూడాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తక్షణమే పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు, బకాయిలు ఇస్తామని, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చారు. కానీ రెండేళ్లయినా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారు. తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కోరుతున్నామన్నారు.
ఉత్తమ్‌వి ఉత్తి మాటలే
మంత్రి ఉత్తమ్.. ఉత్త మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్లుందని హరీష్‌రావు అన్నారు. సోమవారం శాసనసభ ప్రాంగణంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ్ కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు ప్రాజక్టు కోసం నేల మీద పడుకుని పనిచేశానని గుర్తుచేశారు. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చాం. 90టీఎంసీలను 45టీఎంసీలకు తగ్గించారా లేదా? ఉత్తమ్ చెప్పాలని ప్రశ్నించారు. డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా మౌనం ఎందుకు? మా హాయాంలో ఏడు అనుమతులు తెచ్చాం.. రెండేళ్ళల్లో ఒక్క అనుమతి అయినా తెచ్చారా? పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలేనన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ అన్నారు. రెండు టన్నెల్స్ బీఆర్ఎస్ హాయాంలోనే పూర్తి అయ్యాయి మిస్టర్ ఉత్తమ్ మీ చేతకానితనాన్ని మాపై రుద్దుతున్నారన్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు రెండేళ్ళ క్రితం కొబ్బరికాయ కొట్టి డీపీఆర్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్ కు ఇంకా పట్టు రానట్టుంది. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటాడోనని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1900కోట్లు ఖర్చు పెట్టింది. ఏడు ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తెచ్చాం. కాంగ్రెస్ హాయంలో 3డీపీఆర్ లు వాపస్ వచ్చాయి. రెండేళ్ళల్లో ఉత్తమ్ ఒక్క అనుమతి కూడా తేలేదు. సభను కనీసం 15రోజులు జరపాలని బీఏసీలో పట్టు పట్టాం. వారం రోజులు జరుపుతామని స్పీకర్ చెప్పారు. వారం తర్వాత మళ్ళీ బీఏసీ పిలుస్తామన్నారు. నదీ జాలలపై సభలో బీఆర్ఎస్ కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఏసీలో లేవనెత్తాం. కాంగ్రెస్ వచ్చాక ప్రశ్నోత్తర కాలాన్ని కేవలం 6రోజులు మాత్రమే పెట్టారు. ప్రతి రోజు క్వశ్చన్ అవర్ పెట్టాలని కోరాం. ఖాళీగా ఉన్న 16హౌస్ కమిటీలు వేయాలని కోరాం. ఎజెండా పంపే పద్దతి సరిగా లేదన్నారు. 24గంటల ముందే అజెండా ఇవ్వాలని కోరామని తెలిపారు. 15అంశాలపై సభలో చర్చించాలని పట్టు పట్టామని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





