– రోజూ నివేదికలు సమీక్షిస్తూ మంత్రి సీతక్క పర్యవేక్షణ
– ‘సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్’ ప్రారంభం
– చేతి పంపుల మరమ్మతులు చేస్తున్న ‘భగీరథ’
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర చర్యలు చేపడుతోంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ముందస్తు ప్రణాళికతో తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి పరిస్థితిపై రోజువారీగా సమీక్ష జరుగుతోంది. జిల్లాల వారీగా ఎన్ని గ్రామాలకు తాగునీరు సమృద్ధిగా అందుతోంది, తాత్కాలిక సమస్యల కారణంగా ఎన్ని గ్రామాల్లో సరఫరా లోపిస్తోంది, ఆ సమస్యలను ఎన్ని రోజుల్లో పరిష్కరించవచ్చన్న అంశాలపై అధికారుల నుంచి మంత్రి సీతక్క రోజూ నివేదికలు తెప్పించుకుని, తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యల అమలు తీరును పరిశీలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా మార్చి 31న 10,608 పంచాయతీలు తాగు నీటి సరఫరాపై ఆన్‌లైన్‌లో డేటా నమోదు చేశాయి. ఇందులో 10,432 గ్రామ పంచాయతీలకు తాగునీరు సమృద్ధిగా అందుతుండగా, కేవలం 176 గ్రామ పంచాయతీల్లోనే తాత్కాలిక సమస్యలు ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి అన్ని గ్రామాల్లో నిరంతర సరఫరా ఉండేలా గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఆధ్వర్యంలో బుధవారం నుంచి 15వ తేదీ వరకు ‘సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్’ ప్రారంభమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. గ్రామీణ తాగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా చేతి పంపులు, మోటార్లు, పైప్‌లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, నల్లాల మరమ్మతులు వంటి పనులను దశల వారీగా చేపడుతున్నారు. మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. జిల్లా పరిషత్ సీఈఓలు, ఎంపీడీవోలు, డీపీవోలు, చీఫ్ ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనులను సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన చేతి పంపుల మరమ్మతులను 3వ తేదీ(శుక్రవారం) నాటికి పూర్తి చేసేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, ఎక్కడైనా తాత్కాలికంగా నీటి సరఫరా లోపిస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా, అదనపు బోర్‌వెల్స్ వినియోగం, అత్యవసర మరమ్మతులు వంటి ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




