– పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన
– అభివృద్ధి పనులకు సమాంతర ప్రాధాన్యం
– రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి
తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల మూడు నెలల కాలంలోనే కేవలం బీరోలు గ్రామానికి రూ.29.92 కోట్లు మంజూరు చేయడం గమనార్హమన్నారు. ఇందులో భాగంగా రూ.2.59 కోట్లతో బీరోలు నుంచి ఏలువారిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, రూ.64 లక్షలతో ఎస్సీ కాలనీలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అలాగే బంధంపల్లిలో రూ.5.50 కోట్లతో దమ్మాయిగూడెం నుంచి సోలిపురం రోడ్డు మధ్య నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులు, కల్వర్టుల నిర్మాణం, చెరువు మరమ్మతులు వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేశామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం సరఫరా, కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలు సామాన్యుడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించామని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో పేదల చెంతకు చేరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆకేరు వాగు ముంపునకు గురైన రాకాసితండా బాధితులను మంత్రి పరామర్శించి వారికి ఇందిరమ్మ గృహాల మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ ధర్మకర్తలను శాలువాలతో సత్కరించారు.
ఈ నెల ఆఖరుకు లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి
కామేపల్లి : రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శుక్రవారం పర్యటించిన ఆయన సుమారు రూ.12.48 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు, పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. మండలవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మంత్రి పలు బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. జాస్తిపల్లి నుంచి కెప్టెన్ బంజర వరకు రూ.3.15 కోట్లతో చేపట్టే పనులతోపాటు, లాల్యతండా నుంచి జగన్నాథ తండా వరకు రూ.3.33 కోట్లు, ఊటుకూరులో ముత్యాలంపాడు గుడి నుంచి శ్మశానవాటిక వరకు రూ.1.80 కోట్లు, తాళ్ళగూడెం పరిధిలో టేకులతండా, పింజరిమడుగు మీదుగా డోర్నకల్ రోడ్డు వరకు రూ.4.20 కోట్లతో నిర్మించనున్న రహదారులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. గత పాలకులు పదేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేదలను ఊరించి మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను అవహేళన చేసిన వారు తాము అధికారంలో ఉండి కనీసం ఇళ్లు పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



