కొత్త కేంద్రంలో ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తుల అభివృద్ధి
గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం
హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ ఐటీ అని వ్యాఖ్య..
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని మొట్టమొద గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జిఎస్‌ఈసీ )ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే అయిదవది. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది అధునాతన భద్రత, ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడుతుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ సెంటర్ పని చేస్తుంది.
ఇప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్‌ఈసీని తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. హైదరాబాద్ లో ఈ సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవటంతో మరోసారి హైదరాబాద్ ప్రపంచంలో మేటి ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన అయిదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా స్థాయిలో సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.





