– బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిన్హా సూచనలు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హాతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు చర్చించారు. సిన్హాను రామచందర్‌రావు దిల్లీలో మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన కార్యాచరణ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సిన్హా విలువైన సూచనలు చేశారు. సమష్టి కృషితో మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ వచ్చే నెలలో నబీన్ రాష్ట్ర పర్యటన జరగనున్నట్లు తెలిపారు. ఈ పర్యటన ద్వారా పార్టీ బలోపేతానికి మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనేక కీలక అంశాలు, ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రజల దృష్టిని మళ్లించేలా కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనన్నారు. అసెంబ్లీకి రావడం ఏదో గొప్ప విషయంలా చూడడం సరికాదన్నారు. కేసీఆర్ సభకు రావడంపై గబ్బర్ సింగ్ జైలు నుంచి పారిపోయి వచ్చినట్లు హైప్ సృష్టించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. బీజేపీలోని కొందరు లీక్ వీరులు వీక్ కాక తప్పదని, పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతాలకనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా సర్ ప్రక్రియ రాష్ట్రంలో కూడా అమలు కావాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలకు సంబంధించిన అక్రమ ఓట్లు ఉన్నాయన్న విషయం వాస్తవమన్నారు. అలాంటి దొంగ ఓట్లను తప్పనిసరిగా తొలగించాల్సిందేనని, స్వచ్ఛమైన ఓటరు జాబితాల ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



