– జీతాలు నేరుగా ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం
-వేలాదిమంది ఉద్యోగులకు లబ్ది చేకూరే అవకాశం
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్1: తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గత కొన్నేళ్లుగా వేతనాల చెల్లింపులో ఎదురవుతున్న తీవ్ర జాప్యం, మధ్యవర్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏప్రిల్ నెల నుంచి ఈ ఉద్యోగులందరికీ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వేతనాలు అందుతుంటాయి. దీనివల్ల కమిషన్ల పేరిట కొంత మొత్తం కట్ అవ్వడమే కాకుండా, నెలల తరబడి జీతాలు రాక కార్మికులు ఇబ్బందులు పడేవారు. తాజా నిర్ణయంతో మున్సిపాలిటీలు, గురుకులాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య శాఖ , మైనార్టీ సంక్షేమ శాఖల్లో పనిచేసే వేలాది మందికి లబ్ది చేకూరనుంది. నేరుగా ఖాతాల్లో జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులకు ప్రస్తుతం ఏ విధంగానైతే ‘ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్’ ద్వారా జీతాలు అందుతున్నాయో, అదే విధానాన్ని కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా వర్తింపజేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులు సిబ్బంది ఆధార్ కార్డులను వారి బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసే పక్రియను పూర్తి చేశారు. ఉన్నతాధికారులకు ఇందుకు సంబంధించిన డేటాను కూడా పంపడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, టెక్నికల్ వర్కర్లు గతంలో అనేక కష్టాలు పడేవారు. స్థానిక పన్నులు వసూలైతేనే జీతాలు ఇస్తామనే నిబంధనలతో అధికారులు వారిపై ఒత్తిడి తెచ్చేవారు. టార్గెట్లు పూర్తికాకపోతే నెలల తరబడి వేతనాలు ఆగిపోయేవి. దీంతో కార్మికులు తమ నిత్యవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలయ్యేవారు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేయనుండటంతో, పన్నుల వసూళ్లతో సంబంధం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే జీతం వచ్చే అవకాశం ఏర్పడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.