– 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఉత్తర్వులు
– తొలి విడతగా రూ.259.36 కోట్లు కేంద్రం విడుదల
– మిగిలిన వాటిని వెంటనే విడుదల చేయాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేసింది. ఇది రాష్ట్ర గ్రామ పంచాయతీలకు ఊరటనిచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల రెండేళ్లుగా నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం, దానిపై సుప్రీంకోర్టు తీర్పు కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడం ఈ జాప్యానికి ప్రధాన కారణంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాతే పెండింగ్ నిధులు విడుదల చేస్తామని స్పష్టంగా ప్రకటించింది. దీంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే కేంద్ర పెద్దలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి దనసరి అనసూయ సీతక్క పలు దఫాలు విజ్ఞప్తులు చేశారు. గ్రామ పంచాయతీల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంత్రి సీతక్క దిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తోపాటు ఇతర కేంద్ర పెద్దలను పలు దఫాలు ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. గ్రామస్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురు కావడం, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఎన్నికలు జరగని కారణంగా నిధుల విడుదల సాధ్యపడలేదు. ఎన్నికల అనంతరం నిధుల విడుదలకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపారు. మార్చి 31లోపు నిధులు విడుదల కాకపోతే నిధులు శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి నిధులు తీసుకొచ్చే దిశలో దిశా నిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి సీతక్క కేంద్రానికి లేఖలు రాసి కేంద్ర శాఖలతో నిరంతర సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, ఇతర అధికారులు కూడా నిరంతరంగా కేంద్రంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది.
రూ.3000 కోట్ల వరకు పెండింగ్ నిధులు
ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి మొత్తం సుమారు రూ.3000 కోట్ల” రావాల్సి ఉంది. అందులో తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేయడం పట్ల గ్రామ పంచాయతీల్లో ఆశలు చిగురించాయి. మిగిలిన నిధులు కూడా దశలవారీగా విడుదల చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీలకు ఎంతో కీలకమైన నిధులు విడుదల కావడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని తెలిపారు. అదే సమయంలో మిగిలిన నిధులను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క గట్టిగా విజ్ఞప్తి చేశారు. గ్రామ స్వరాజ్యం బలోపేతం కావాలంటే గ్రామ పంచాయతీలకు సమయానికి నిధులు అందడం అత్యంత అవసరమని ఆమె స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



