సర్పంచ్‌లకు సీఎం రేవంత్‌ ‌శుభవార్త

– పెద్ద పంచాయతీలకు పది, చిన్నవాటికి రూ.5 లక్షల నజరానా
– నేరుగా విడుదల చేస్తానని ప్రకటన
– గ్రామాల అభివృద్ధికి నడుం బిగించాలని పిలుపు
– కేంద్రం నుంచి మార్చిలోగా రూ.3వేల కోట్లు వస్తాయి
– కొడంగల్‌లో సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో రేవంత్‌ ‌

మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌గ్రామాల అభివృద్ధికి కొత్త సర్పంచ్‌లు తమవంతుగా కృషి చేయాలని, వారికి ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందని సీఎం రేంవత్‌ ‌రెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కొడంగల్‌ ‌నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. సర్పంచ్‌లకు శుభవార్త చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు చొప్పున ఇస్తామన్నారు. సర్పంచ్‌లకు స్పెషల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫండ్‌ ‌కింద నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులు ఇస్తామని తెలిపారు. అలాగే గ్రామాల్లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు జారీ చేస్తాని సీఎం ప్రకటించారు. కేంద్రం నుంచి 3వేల కోట్లు రావాల్సి ఉందని, మార్చిలోగా వాటిని తెచ్చే బాధ్యత తనదని, వాటిని నేరుగా గ్రామాలకు అందచేస్తామన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో పనులు మొదలు పెట్టాలన్నారు. మీ సహకారం వల్లే నేను ఇంతటివాడినయ్యాను. 2009 నుంచి నన్ను భుజాలపై మోశారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాల్లో వివక్ష లేకుండా పరిపాలన సాగాలి. పార్టీలు.. పంతాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలి. గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా సర్పంచ్‌లు ఉండాలి. ప్రజలకు ఉన్నతమైన, నాణ్యమైన సేవలు అందించాలి. పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి కావాలని నూతన సర్పంచ్‌లకు సీఎం రేవంత్‌ ‌సూచించారు. నూతన సంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పంచాయతీలకు యథావిధిగా వచ్చే నిధులు కాకుండా చిన్న గ్రామాలకు రూ.5లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు చొప్పున ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టు కునేందుకు గ్రామాల్లో సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్పంచ్‌లకు సూచించారు.
గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఉపయోగించాలన్నారు.కొడంగల్‌ ‌నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ప్రతి గ్రామం, తండాకు రోడ్లు పూర్తి చేస్తాం. గుడి, బడి, తాగునీరు, పేదలకు ఇళ్లు, రేషన్‌ ‌కార్డులు అందిస్తాం. నిరుద్యోగుల కోసం ఇండస్ట్రియల్‌ ‌పార్కును అభివృద్ధి చేస్తాం. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు.. గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజా సేవ చేయాలి. దేశ పునాదులు గ్రామాల్లో ఉన్నాయని గాంధీజీ చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. పేదలకు పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అందుబాటులోకి వస్తుంది. కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టిన నాయకులను అభినందిస్తున్నా. ఇక్కడి సమస్యల పరిష్కారానికి మా సోదరుడు తిరుపతిరెడ్డిని అందుబాటులో ఉంచా. ఎన్నికలు ముగిశాయి.. ఇక ఎలాంటి రాజకీయాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే పార్టీలు, పంథాలు ఉండాలి. రాష్ట్రానికి నాయకత్వ వహిస్తున్న మనం అందరినీ కలుపుకొని పోదాం అని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదని సీఎం అన్నారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *