– మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (court of wards) ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు (gone Prakashrao)తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, ఇతరులకు చెప్పానని, వారు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. దిల్లీలోి శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా చెప్పానని, దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరానని.. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఏఐసీసీ పెద్దలను కూడా కలిసి తన వద్ద ఉన్న వివరాలు అందిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు రాజ కుటుంబాల ఆస్తులు, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఆస్తులు ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్నాయని గుర్తుచేశారు. బ్రిటిష్ చట్టం కాబట్టి దీనిపై ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారన్నారు. ల్యాండ్ క్రూయిజర్ కార్లు, ఇన్నోవా కార్లపై మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టి ఉందని విమర్శించారు. రేపు ప్రతి మంత్రి హెలికాప్టర్‌లో తిరగాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని తాను చూస్తున్నానని తెలిపారు. రెండు రోజుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలుస్తానని, ఆ ఆస్తులను కాపాడాలని కోరతానని ప్రకాశరావు చెప్పారు. గతంలో ఈ విషయంపై జానారెడ్డి అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పూర్తయిన తర్వాత కేంద్రంలో కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల అంశాన్ని బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆదాయాన్ని సమకూర్చుకుంటే రెండు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేసుకోవచ్చన్నారు.





