తండ్రిని కన్నీరు పెట్టిస్తున్న కవిత

– ఆమెను ఎవరో వెనక నుంచి నడిపిస్తున్నారు
– ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి  

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 5: కవిత వ్యాఖ్యలపై ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఘాటుగా స్పందించారు. ఆమె మాటలు బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమెను ఎవరో వెనుక ఉండి ఆడిస్తుంటే కీలుబొమ్మగా మారి ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేసీఆర్‌ ‌ని కంటతడి పెట్టిస్తూ, ఆయనను మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సునీత స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బహిష్కరిస్తే, కవిత మాత్రం భిన్నంగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా కేవలం ఒక నాటకమని, ఆమె మనస్ఫూర్తిగా ఆ పని చేయలేదని ఎద్దేవా చేశారు. నిజంగానే పదవి అవసరం లేదనుకుంటే కౌన్సిల్‌ ‌సమావేశాలకు ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు. అసలు పార్టీలో స్వేచ్ఛ లేకపోతే కవిత ఇన్ని పదవులు ఎలా పొందగలిగారని, ఓడిపోయినప్పటికీ కేసీఆర్‌ ఆమెకు ఎమ్మెల్సీగా గౌరవప్రదమైన అవకాశం కల్పించిన విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. పార్టీలో కవితకు ఉన్నంత చనువు మరెవరికీ లేదని, అలాంటిది ఇప్పుడు పార్టీని డ్యామేజ్‌ ‌చేసేలా మాట్లాడటం కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్‌ఎస్‌ గా మార్చడం ఇష్టం లేదంటున్న కవిత మరి తన సొంత సంస్థ అయిన తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎలా మార్చారని సునీత నిలదీశారు. ఇది ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమని, కంకణం కట్టుకుని మరీ బీఆర్‌ఎస్‌ని ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. లిక్కర్‌ ‌కేసులో ఇరుక్కున్నప్పుడు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ‌వారానికి నాలుగుసార్లు దిల్లీకి తిరిగి ఆమె కోసం ఎంతో శ్రమించారని, కానీ ఇప్పుడు ఆమె మాత్రం పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు కనీస సమయం ఇవ్వని ప్రభుత్వం కవితకు మాత్రం అంత సమయం ఎలా కేటాయించిందో చూస్తుంటే ఆమెను ఎవరు నడిపిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని, ఇకపై ఆమె ఆటలు సాగవని  సునీత హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *