– మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: అంతర్జాతీయ ఆటగాళ్లను ఆకర్షించడం వల్ల తెలంగాణ గోల్ఫ్ టూరిజం కేంద్రంగా ఎదగగల సామర్థ్యం ఉందని స్పష్టమవుతోందని, మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి, హైదరాబాద్‌ను ప్రపంచ గోల్ఫర్లకు ప్రీమియర్ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్-2025 ముగింపు కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరిచి పర్యాటక రంగాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు విత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రపంచ పర్యాటకులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ టోర్నమెంట్‌లను హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు అనంతరం విజేత బంగ్లాదేశీ గోల్ఫర్ జమాల్ హుస్సేన్‌కు రూ.15 లక్షలు, రన్నరప్ అక్షయ శర్మకు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు. విజేతలకు, టోర్నీలో పాల్గొన్న గోల్ఫర్లకు, ఈవెంట్‌ను విజయవంతం చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్షుడు బీవీకే రాజు, పీజీటీఐ సీఈవో అనుదీప్ జైన్, పీజీటీఐ డైరెక్టర్ వికాస్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్‌లో ప్రొఫెషనల్ గోల్ఫర్స్, అమెచ్యూర్ గోల్ఫర్స్, ఇండియా, చెక్ రిపబ్లిక్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌ల లోని ప్రముఖ అంతర్జాతీయ గోల్ఫర్స్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





