– అందనంతగా రోజురోజుకూ పెరుగుదల
– ఏకంగా రూ.3వేలు పెరిగిన తులం ధర
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: బంగారం భగభగమండుతోంది. సామాన్యులను ఊరిస్తున్న పుత్తడి సంపన్నులనూ సవాల్ చేస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు.. రాకెట్ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఏకంగా రూ.1.40 లక్షల వైపుకు దూసుకెళ్తోంది. ధనత్రయోదశి కి ఒక్కరోజు ముందు బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా రూ.3 వేలకుపైనే పెరిగింది. ఫలితంగా తులం బంగారం రూ.1.35 లక్షలు దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ వర్గాల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,250గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,21,725కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.1,81,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అతివిలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం వల్లనే దేశీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండటం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించనుండటం, చైనా-అమెరికా మధ్య టారిఫ్‌లు కూడా ధరలు దూసుకుపోవడానికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నాయి. మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.అంతేకాదు, ధనత్రయోదశి. ఈ రోజున బంగారం, వెండి కొనుగోళ్లు శుభప్రదమని దేశంలోని మెజారిటీ ప్రజల విశ్వాసం. బంగారం కొనుగోలు చేస్తే సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఆరోజు బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




