– రూ.1.25 లక్షల వద్ద కొనసాగుతున్న తులం రేటు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్18: దేశీయంగా పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలుతగ్గుముఖం పట్టాయి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.25 లక్షలు పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.1.14 లక్షల వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర సైతం కిలో రూ.1.56 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈనెల 13వ తేదీన 10 గ్రాముల పసిడి రూ.1.30 లక్షల వద్ద ఉంది. ఐదు రోజుల వ్యవధిలో రూ.5వేల మేర తగ్గింది. వెండి కిలో రూ.1.70 లక్షలు ఉండేది. అప్పటితో పోలిస్తే దాదాపు రూ.15వేలు తగ్గింది. అప్పట్లో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం 4200 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు 4010 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ప్రస్తుతం ఔన్సు 49 డాలర్లుగా ఉంది. ఈ ధరలను అనుసరించి దేశీయంగానూ ధరలు తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా బంగారానికి, అమెరికాలోని వడ్డీ రేట్లకు విలోమ సంబంధం ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు బంగారం ధర పడుతుంది. తగ్గినప్పుడు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెల ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు క్షీణించడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. దీనికితోడు డాలర్ ఇండెక్స్ బలపడడమూ మరో కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగిసిన నేపథ్యంలో కీలక ఎకనామిక్ డేటా ఈ వారం వెలువడనుంది. ఫెడ్ గత టింగ్‌కు సంబంధించిన మినిట్స్, సెప్టెంబర్ నెలకు సంబంధించి జాబ్స్ డేటా ఈ బుధ, గురువారాల్లో వెలువడనుంది. ఈ డేటా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని, బంగారం ధరలను ప్రభావితం చేయనుంది. వాస్తవానికి వచ్చే నెలలో మరోమారు వడ్డీ రేట్లలో కోత ఉంటుందని తొలుత అంచనాలు ఉన్నప్పటికీ.. ఫెడ్ అధికారులు మాత్రం దీనిని తోసిపుచ్చుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




