ప‌ట్ట‌ప‌గ్గాల్లేని ప‌సిడి ధ‌ర‌

– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,420
– కిలో వెండి సుమారు రూ.1.54 లక్షలకు చేరిక

న్యూదిల్లీ, అక్టోబర్‌ 6: బంగారం ధర రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. ట్రంప్‌ టారిఫ్‌లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు కలిసి పుత్తడికి ఇన్నాళ్లు డిమాండ్‌ పెంచగా తాజాగా అమెరికా ఫెడరల్‌ గవర్నమెంట్‌ షట్‌డౌన్‌ ఇంకా కొనసాగుతుండడంతో బంగారం ధరకు పట్టపగ్గాల్లేకుండా పోయింది. దీంతో అంతర్జాతీయ విపణిలో ఔన్సు ధర 4 వేల డాలర్ల దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ ధరలననుసరించి దేశీయంగా పసిడి ధర సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర సోమవారానికి 3935 డాలర్లకు చేరింది. డాలర్‌ విలువ రూ.88.79 కావడంతో దీని ధర ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,420కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,700 పలుకుతోంది. ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గిస్తుందదన్న అంచనాలు, డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించడం, అమెరికా బాండ్ల రాబడి పడిపోవడం వంటివి ఇప్పటికే బంగారానికి డిమాండ్‌ పెంచాయి. మరోవైపు భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా డాలర్‌కు బదులు కేంద్ర బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటూ ఉండడం మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అటు వెండి ధర కూడా కిలో రూ.లక్షన్నర దాటింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి సుమారు రూ.1.54 లక్షలుగా ఉందని బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ధరకు సామాన్యులు బంగారం కొనేందుకు వెనకాడుతుండగా క్రయవిక్రయాలు చాలా వరకు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర ఆభరణాల వైపు మగువలు మొగ్గుచూపు తున్నారని చెబుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *