నికర జలాలు ఎగువ రాష్ట్రం పాలు!

“ఒక వైపు కర్ణాటక రాష్ట్రం చాప కింద నీరులా ఆల్మట్టి ఎత్తు పెంచేందు యత్నాలు చేస్తున్నా అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ప్రతిపాదనలు వచ్చిన తొలి రోజుల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని కూడా బిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ మాత్రం కించిత్తు కూడా స్పందించలేదు. ఆ మాట కొస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పదహారు నెలల కాలంలో బనకచర్ల అనుసంధానం గురించి తప్ప సాగునీటి రంగం గురించి ఏ స్థాయిలో కూడా అందునా అంతర్ రాష్ట్ర జల వివాదాల గురించి సమీక్షలు జరగడం లేదు. స్పందించడం అంతకన్నా లేదు.”   
గోదావరి వరద జలాలు కోసం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు చిన్న సైజ్ యుద్ధమే చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమిటో గాని తను ప్రతిపాదించిన పోలవరం బనకచర్ల అనుసంధానం అంశంలో తెలంగాణతో వాద వివాదాలకు దిగ వద్దని తన వాళ్లను కట్టడి చేసినందున బిఆర్ఎస్ నేతలు గాని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు గాని వ్యతిరేకించుతూ ప్రకటనలు చేస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ వైపు నుండి ఎట్టి స్పందన లేకపోవడంతో క్రమేణా ఈ వివాదం సద్దుమణిగింది. ఈ పరిణామం ఒక విధంగా మంచిదైంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రకటనల యుద్ధం తప్పింది. తత్ఫలితంగా ఉద్రిక్తతలు నివారింప బడ్డాయి. కాని విషాదమేమంటే గోదావరి వరద జలాల కోసం తగాదా పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఎగువ రాష్ట్రాలు జల దోపిడీ గురించి పట్టించుకోక పోవడమే. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం పూర్తిగా కొరవడింది. కనీసం ఎవరికి వేరైనా ప్రశ్నించడం లేదు. ఇప్పుడే కాదు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ జల వివాదాలు కొనసాగుతున్నాయి. కాని ఎగువ రాష్ట్రాలు జల చౌర్యం గురించి ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదు.
    మొన్న సెప్టెంబర్ నెలలో సమావేశమైన కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్గం ఆల్మట్టి జలాశయం ఎత్తు 519. 6 మీటర్ల నుండి 524.256 మీటర్ల ఎత్తుకు పెంపుదల చేయాలని తీర్మానం చేసింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకూ శరాఘాతమే. అదే సమయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013 లో వెలువరించిన తీర్పు నోటిఫై చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సుప్రీంకోర్టు స్టే తో ఈ తీర్పు నోటిఫై కాలేదు. ఈ తీర్పు అమలు జరిగితే తీవ్ర నష్టమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కి స్టే తెచ్చింది. తరువాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసు లో ఇంప్లీడ్ అయింది. ఈ తీర్పు నోటిఫై చేస్తే గాని కర్ణాటక  ప్రభుత్వం ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచే అవకాశం లేదు.
కాని ఇవేవీ పట్టించుకోకుండా ఆల్మట్టి జలాశయం ఎత్తు 524.256 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైంది. కర్ణాటక  ప్రభుత్వం ఆల్మట్టి జలాశయం నిర్మించిన తర్వాత నైరుతి పవనాలు ప్రారంభమై భారీ వరద కృష్ణకు వచ్చినా దిగువకు వరద రావడం ఆలస్యమౌతోంది. ఆల్మట్టి జలాశయం ఎత్తు 524.256 మీటర్లకు ఎత్తు పెంచితే మరొక 150 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. 519.6 మీటర్ల ఎత్తుకు జలాశయం వుంటే 129.72 టీఎంసీల నీరు ఉండగా 524.256 మీటర్ల ఎత్తుకు పెంచితే నీటి నిల్వ సామర్థ్యం 279. 72 టిఎంసిలు పెరుగు తుంది. చట్ట పరంగా ఆ విధంగా నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. పైగా నైరుతి పవనాల తొలి రోజుల్లో కర్ణాటక  ప్రభుత్వం వచ్చిన నీళ్లు వచ్చినట్లు వాడు కోవడం తోడైతే దిగువకు వరద రావడం మరింత ఆలస్యమౌతుంది. పైగా వర్షాభావ సంవత్సరాల్లో అయితే కిందకు బొత్తిగా నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఇలాంటి అనుభవాలు చాలా వున్నాయి.
    ఈ నేపథ్యంలో ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపుదలకు రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానం మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ఇటీవల భూసేకరణ గురించి ఉత్తర్వులు జారీ చేసింది. దూకుడు పెంచినట్లే భావించాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టం పరిహారం ఇచ్చేందుకు ఈ ఉత్తర్వులో సంసిద్ధత తెలిపింది. ఆల్మట్టి జలాశయం ఎత్తు 524.256 మీటర్లకు పెంచితే లక్ష 33 వేల ఎకరాలు ముంపుకు గురౌతుందని ఈ భూమి సేకరణకు ఒక అథారిటీని కూడా నియమించుతూ ఈ ఉత్తర్వులలో పేర్కొన్నది. ఏటా 18 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయ దలచినట్లు వివరించింది. భూసేకరణ పూర్తి అయితే ఆల్మట్టి జలాశయంలో అదనంగా నీళ్లు నింపడానికి అనుకూలత ఉంది . అన్ని రిజర్వాయర్లకు క్రస్ట్ గేట్లు పూర్తిగా ఉంచుతారు. కాని ఆల్మట్టి జలాశయం క్రస్ట్ గేట్లు పై భాగంలో కట్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా 524.256 మీటర్ల స్థాయికి నీళ్లు నింపాలంటే షీట్ ముక్కలు వెల్డింగ్ చేస్తే సరిపోతుంది.
సుప్రీంకోర్టు స్టే ఉన్నందున ఏకంగా ఒకే దఫా కాకుండా దశల వారీగా పెంపుదల చేసేందుకు కర్ణాటక  ప్రభుత్వం నిశ్చయించినట్లుంది. ఒక వైపు కర్ణాటక రాష్ట్రం చాప కింద నీరులా ఆల్మట్టి ఎత్తు పెంచేందు యత్నాలు చేస్తున్నా అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ప్రతిపాదనలు వచ్చిన తొలి రోజుల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని కూడా బిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ మాత్రం కించిత్తు కూడా స్పందించలేదు. ఆ మాట కొస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పదహారు నెలల కాలంలో బనకచర్ల అనుసంధానం గురించి తప్ప సాగునీటి రంగం గురించి ఏ స్థాయిలో కూడా అందునా అంతర్ రాష్ట్ర జల వివాదాల గురించి సమీక్షలు జరగడం లేదు. స్పందించడం అంతకన్నా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *