– ఎల్లంపల్లి శ్రీపాద నుంచి నీటిని తరలిస్తాం
– ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కానే కాదు
– మూసీ ప్రక్షాళనన చేపట్టి తీరుతాం
– తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లను నిర్మిస్తాం
– సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 8: హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వరద నియంత్రణ కోసమే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించారని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించడానికే పీజేఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా.. ఉస్మాన్‌సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.గోదావరి నదీ జలాలను మూసీ నది, ఈసా నదిలో కలిపి నగర ప్రజల దాహార్తిని తీర్చుతాం. హైద్రాబాద్ నగరంకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరుంది. 1908లో నగర ప్రమాదాన్ని నివారించడానికి నిజాం సర్కార్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. ప్రపంచంలోనే గొప్ప ఇంజినీర్లతో నిజాం సర్కార్ ఈ ప్రాజెక్టులు కట్టింది. దూరదృష్టితో ఆలోచించి ఈ ప్రాజెక్టులు కట్టడంతో నగర దాహం తీరుతోంది. నగరంలో జనాభా పెరుగుతోంది, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్నారు. నగర జనాభా కోటిన్నరకు చేరింది. పీజేఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఖాలీ కుండలతో అసెంబ్లీ ముందు ధర్నాలు చేసి.. మంజీరా, కృష్ణా జలాలను హైదరాబాద్ తరలించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు శ్రీపాద ఎల్లంపల్లి నీటిని తరలించడానికి శంకుస్థాపన చేస్తే 2014 నుంచి నగరానికి వొచ్చాయి’ అని సీఎం రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని అన్నారు. సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎవరు అడ్డం వొచ్చినా ఈ పథకం పూర్తి చేస్తాం. నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా, నల్గొండ ప్లోరైడ్ సమస్య తీరుతుంది. భారత రాష్ట్ర సమితి వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది. మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలి. త్వరలో మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎంను కలుస్తామని సీఎం అన్నారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? అని సీఎం ప్రశ్నించారు. రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేయనున్నారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నల్లగొండ జిల్లాలో మూసీ నది కాలుష్యానికి మారు పేరుగా మారింది. ఆ నీరు త్రాగి పశువుల ప్రాణాలే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. మూసీ నది నీటి వల్ల ఆడబిడ్డలకు పురిటి సమస్యలకు కారణం అవుతుంది. నల్లగొండ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ పరిస్థితి చూసి మూసీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నా. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీల నీరు, కంపెనీల కాలుష్యం మూసీలో కలవకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు పెట్టడం జరిగిందన్నారు. గేట్ వే ఆఫ్ దిల్లీ, గేట్ వే ఆఫ్ ముంబై ఉంది. ఇప్పుడు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కూడా ఉంటది. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలి. అందుకు అందరి సహకారం కావాలి. రాబోయే రోజుల్లో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేద్దాం. ఎవరు అడ్డుకున్నా మన ప్రభుత్వం తిప్పి కొడుతుందన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, పేద్దోళ్ల రాజ్యం. పేదోళ్లకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. 2014 నుంచి బీఆర్‌ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకు రావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.అప్పట్లో ఐటీ మంత్రిగా ఉన్న వ్యక్తి నగరానికి వచ్చే నీటిని నెత్తి ద చల్లుకున్నాడు. ఆయన నీళ్ళు చల్లుకున్నంత మాత్రాన చేసిన పాపాలు ఎక్కడికి పోవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వివిధ ప్రాజెక్టుల నుంచి నగరానికి నీళ్లు తీసుకువచ్చారు. 2014 నుంచి ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మేము అధికారంలోకి వచ్చాక గోదావరి నీళ్ళని తీసుకురావడానికి ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్తున్నాం. ఒక వ్యక్తి తాడిచెట్టు లాగా పెరిగాడు కానీ ఏమి లాభం లేదు. గోదావరి జలాలు కాళేశ్వరం నుండి వచ్చేవే కదా అంటున్నాడు. కానీ వాళ్ళు కట్టిన కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి తాత ముత్తాతలు కట్టలేదు. గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం. కాకా సూచన మేరకు ప్రాణహిత చేవెళ్లకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుగా అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి నామకరణం చేశారు. చేవెళ్లలో రాజశేఖర్ రెడ్డి వేసిన శిలాఫలకం లేదా. కానీ దాన్ని ఆపి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు దగ్గర 152 టర్ల ఎత్తులో కడతాం అని అడిగాం. 149 టర్లకు ఒప్పుకున్నారు. గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. చేవెళ్ల, పరిగి, వికారాబాద్ కు నీళ్ళు తీసుకువస్తామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





