– గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు
– తీరప్రాంత ఆలయాల అభివృద్ధికి తక్షణ చర్యలు
– పుష్కరాలపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్12: గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేలా గా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీంతోపాటు పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద శాశ్వత ఘాట్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకేసారి రెండు లక్షలమంది స్నానాలు చేసేందుకు వీలుగా ఘాట్లు ఉండాలని సూచించారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతోపాటు గోదావరి పరిసర ఇతర ఆలయాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరీవాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్‌ను విస్తరించడంతోపాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వొచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగిన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. 2027 జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయని, ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కి.మీ తీర ప్రాంతముంది. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతోపాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక ప్రధాన ఆలయాల దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు అక్కడ శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు- వాహనాల పార్కింగ్, తాగు నీరుతో పాటు భక్తులకు అవసరమైన వసతులన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.
మహా కుంభమేలా తోపాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతోపాటు గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలన్నింటినీ సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేయాలన్నారు. స్థానిక పరిస్థితులకనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు. ఇక, పుష్కరాల ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ తోపాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలన్నారు. దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక శాఖ, నీటి పారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





