– స్వల్పంగా పెరిగే అవకాశం
భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 25 : అల్పపీడనం కారణంగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న బారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం ఉదయం 6గంటలకు 21 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 26 అడుగులకు చేరుకుంది. ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉంది. గత 15 రోజులు క్రితం కూడ గోదావరి 41 అడుగులకు చేరుకుని వేగంగా తగ్గుముఖం పట్టింది. మళ్ళీ వర్షప్రభావం ఎక్కువగా ఉండటం వలన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. మహరాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్ , ఒడిస్సా రాష్ట్రాల నుండి భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీని కారణంగా భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శనివారం ఉదయంకు 30 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది.ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదతో చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండల మారింది.ప్రమాదస్థాయికి చేరుకోవడంతో శుక్రవారం నాడు ఆరు గేట్లను పూర్తిగా ఎత్తివేసి 24,905 క్యూసెక్కుల నీటిని దిగువ భాగంలో ఉన్న గోదావరి లోకి విడుదల చేసారు.అంతేకాకుండా కిన్నెరసాని ప్రాజెక్టులో కూడ వరద నీరు భారీగా ఉండటంతో అధికారులు నీటిని క్రిందిభాగానికి విడుదల చేసారు. కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే మణుగూరు ప్రాంతం అంతా జలమయం అయింది. కోడిపుంజులవాగు ఉదృతంగా ప్రవహించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. క్రింది భాగంలో ఉన్న ఇంటి యజమానులను అప్రమత్తం చేసారు. వర్షపునీరు బయటకు వెళ్ళే పరిస్థితి లేక వర్షపునీరు ఇండ్లలోకి రావడంతో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జేసిబి ద్వారా నీరు బయటకు వెళ్ళేందుకు పూడికలు తీసారు. భారీ వర్షం కారణంగా భద్రాద్రి జిల్లాలో సింగరేణి సంస్థకు బారీగా నష్టం వాటిల్లింది. బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.





