– సిద్దిపేటలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
– రూ.3.42 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
– కబరస్థాన్ సమస్య పరిష్కరిస్తానని హామీ
– ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి
సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 13: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని,ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన , గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.3 కోట్ల 42 లక్షల విలువైన కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయంలో సుమారు 40 శాతం అప్పుల వడ్డీ చెల్లింపులకు వెళ్తున్నా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, సిద్దిపేట నియోజకవర్గంలో ఈ పథకం చక్కగా కొనసాగుతోందని అన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా త్వరలోనే అనుమతులు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.కొత్త రేషన్ కార్డులను ఇప్పటికే మంజూరు చేశామని, అర్హులైన వారికి త్వరలో వృద్ధాప్య పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రూ.13 వేల కోట్లతో నిరుపేదలకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమ్మిట్ ద్వారా ఐదు లక్షల ఉద్యోగాల సృష్టికి దారితీసే పెట్టుబడులు రానున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు శిక్షణ అందిస్తున్నామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో రూ.18 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చేతికి దట్టి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లింల కోసం ప్రతి ప్రాంతంలో షాదీ ఖానా, కబరిస్థాన్‌ల ఏర్పాటుకు ఒక్కో ప్రాంతానికి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.సిద్దిపేటలో కబరిస్థాన్ కోసం ముస్లింలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే అనువైన స్థలం గుర్తించాలని సిద్దిపేట ఆర్డీవో సదానందంను మంత్రి ఆదేశించారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు అందించే అంశంపై మైనార్టీ శాఖ మంత్రితో చర్చిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




