– ప్రభుత్వంలో, పార్టీలో ప్రాధాన్యం లేదని కినుక
– అందుకే బీఆర్ఎస్‌లోకి వెళ్తున్న జీవన్‌రెడ్డి
– ఆవిర్భావ దినోత్సవం రోజున గులాబీ దళంలోకి..
– రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
– బీఆర్ఎస్ పాలనపై పొగడ్తలు
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 9 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైపోయింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆయన ఆ పార్టీలోకి మారనున్నారు. బీఆరఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గురువారం మధ్యాహ్నం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి తమ పార్టీలోకి ఆహ్వానించగా అందుకు జీవన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడంతో ఇక ఆ పార్టీలో అధికారికంగా చేరడమే ఆలస్యం. దానికికూడా త్వరలోనే ముహూర్తం సిద్ధమవుతున్నది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ అధినాయకుడు కేసీఆర్ సమక్షంలో బీఆరఎస్ చేరే అవకాశముంది. కానిపక్షంలో జగిత్యాలలోనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోవచ్చు అని తెలుస్తోంది. ఏదిఏమైనా కేసీఆర్‌ను కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న తర్వాతనే పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటించే అవకాశముంది. కొద్దికాలంగా జీవన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అసహనంతో రగిలిపోతున్నారు. దాంతో ఆయన రేవంత్‌రెడ్డి పోవాలె.. కాంగ్రెస్ పార్టీలో మార్పు రావాలె అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌కు సేవలందించిన తనను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందంటూ ఆయన ఇటీవల కాలంలో పలుమార్లు మీడియా వద్ద తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తనతోపాటు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులైన పలువురిని కాదని, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పార్టీలో, పదవుల్లో ప్రాధాన్యమివ్వడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావలసిన బలానికి మించిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తెచ్చుకోవాల్సిన అగత్యం ఏముందంటూ పార్టీ ముఖ్య నేతలను నిలదీస్తూ వచ్చారు. పార్టీ అధినేత రాహుల్‌గాంధీ రాజ్యాంగ రక్షణపై పోరాటం చేస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధ చర్యలు చేపడుతున్నారని ఆక్రోశి¾ంచారు. ప్రధానంగా బీఆరఎస్‌కు చెందిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకున్నప్పటినుండి ఆయన అసంతృప్తి పతాకస్థాయికి చేరుకుంది, తనకు ఏమాత్రం సమాచారం లేకుండా సంజయ్‌ను తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేగాక పార్టీ కార్యక్రమాలన్నిటిలో సంజయ్‌కే ప్రాధాన్యమివ్వటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఆగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. జగిత్యాలలో 50 వార్డులుండగా తాను చెప్పిన వారిలో 17మందికే పార్టీ టికెట్ కేటాయించడంతో ఆయన రగిలిపోయారు. పార్టీ కోసం తనతోపాటు దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్తలను కాపాడుకోలేకపోతున్నందుకు ఆవేదనకు గురయ్యారు. ఆ విషయమై ఆయన అధిష్టానం, పార్టీ ముఖ్యలతో చర్చించినా లాభం లేÅ£పోయింది. దీంతో ఇక తనకు కాంగ్రెస్‌లో మనుగడలేదన్న అభిప్రాయానికి వచ్చారు. అదే విషయాన్ని బాహాటంగా ప్రకటిస్తూ వచ్చారు. అయినా ముఖ్యమంత్రి నుండి స్పందన కనిపించలేదు. ముఖ్యమంత్రి దూతలుగా మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మరో ఒకరిద్దరు నాయకులు కాంగ్రెస్‌ను వీడొద్దంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. అయితే తీవ్ర అవమానం, మనస్తాపంతో రగిలిపోతున్న జీవన్‌రెడ్డి తన నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితిలో మార్చుకోలేనని స్పష్టం చేయడంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆయనను ఆహ్వానించాయి. బీఆర్ఎస్‌కు చెందిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అయితే తమ పార్టీ అనుమతిస్తే తాను జీవన్‌రెడ్డిని తన భుజాలమీద ఎక్కించుకుని వస్తాననడం ఆయన పట్ల పార్టీ వర్గాలకున్న అభిప్రాయానికి అద్దంపడుతోంది. బీజేపీ ఎంపీ ఆర్వింద్ జీవన్‌రెడ్డిని ఆహ్వానించాల్సిందిగా తమ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు కూడా. ఏదిఏమైనా ఆయన బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపడం.. ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గురువారం స్వయంగా ఆయన గృహానికి వెళ్ళి కేసీఆర్ మాటగా ఆహ్వానించడం, అందుకు జీవన్‌రెడ్డి సమ్మతించడం జరిగిపోయింది. ఈ సందర్భంగా రెండున్నర ఏండ్ల రేవంత్ పాలనకన్నా కేసీఆర్ పాలన ఎన్నో రెట్లు బెటర్‌గా ఉందని జీవన్‌రెడ్డి కితాబు ఇవ్వడం గమనార్హం.
జీవన్‌రెడ్డి చేరిక బీఆర్ఎస్‌కు బలమేనా?
జీవన్‌రెడ్డి చేరిక బీఆర్ఎస్‌కు తప్పక బలాన్ని చేకూర్చవచ్చని విశ్లేషకులు అంటున్నారు. జగిత్యాలతోపాటు ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల్లో ఆయనకు బలమైన అనుచరగణముంది. ఉత్తర తెలంగాణలో కీలక నాయకుడు కావడంతో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ బలం తగ్గి బీఆరఎస్‌కు బలం పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పాలనతో అసంతృప్తిగా ఉన్న పలువురు జీవన్‌రెడ్డిబాట పట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. వాస్తవానికి 2006, 2008లో కరీంనగర్ పార్లమెంటుకు కేసీఆర్‌తో పోటీపడి ఓడిపోయినప్పటికీ కేసీఆర్ తనకు చిరకాల మిత్రుడిగా జీవన్‌రెడ్డి చెప్పుకోవడం గమనార్హం. 2014లోనే తనను పార్టీలోకి ఆహ్వానించారని, కానీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి తాను ఆనాడు తిరస్కరించినట్లు చెబుతున్న జీవన్‌రెడ్డి బీఆరఎస్‌లో చేరిక ఎప్పుడు, ఎక్కడ అన్న విషయం తన చిరకాల మిత్రుడిని కలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





