నెంబర్-1 స్థానంలో నిలపడమే ధ్యేయం

-రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాం
-రెండేళ్లలోనే రికార్డుస్థాయిలో పెట్టుబడులు సాధించాం
-నాలుగోసారి బడ్జెట్‌కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు
-విమర్శలు కాదు.. సూచనలు చేయండి
-అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రసంగించిన భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో నాలుగవసారి 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజానీకానికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భ‌ట్టి ప్ర‌సంగం ఇలా సాగింది. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో తాము పాలన సాగిస్తున్నాం. తాము పాలకులం కాదు ప్రజలకు సేవకులం.. ప్రజలు తమకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజాసంక్షేమ, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం.. రెండేళ్ల పాలనలో ప్రజలకు తామిచ్చిన వాగ్దానాలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం.. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వా-కి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనదే తమ లక్ష్యం. ఈ రెండేళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులను తీసుకురాగలిగాం,. లక్ష్యాల వైపు అడుగు వేయడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్కచేయక ముందుకు సాగుతున్నాం.. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే వెచ్చిస్తున్నాం.. ప్రతి పైసాకు తాము కాపాలాదారులుగా ఉంటున్నాం.. ఆదర్శవంతమైన పాలనలో రాష్ట్రాన్ని దేశానికి తలమానికంగా నిలబెడుతున్నాం.. పటిష్టమైన ప్రణాళిక, దూర దృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల తమని నడిపిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తెలంగాణ ప్రజానీకం పట్ల వారి అభ్యున్నత పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేశాం.. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు. ప్రజల చుటట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవనస్థితిగతుల మార్పునకు దోహదపడే లెక్కలు.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాము. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకతతో పాలన సాగిస్తున్నాం. గొప్పల కోసం అబద్ధాలు చెప్పం.. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పనిచేస్తున్నది.. స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహార్‌లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయస్థాయి విద్యా సంస్థలుగాచ తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాము. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపర చడం, పెట్టుబడులను ఆకర్షించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్వయంగా జపాన్, సింగపూర్, దావోస్‌ పర్యటనలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలతో సమావేశమై మెప్పించి, ఒప్పించడంవల్ల గత రెండేళ్లలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాము. 2025-26లో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ప్రకారం రూ.17,82,198 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.7శాతంగా నమోదు అయ్యింది. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.357,13,886 కోట్లు కాగా, వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. అదేవిధంగా దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ 5.0శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన’ గా నిలుస్తోంది. స్టేట్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికారాన్ని అందించడానికి ఏడాది కొత్తగా 20074 మొబైల్ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. రూ.368 కోట్ల 27 లక్షల అంచనాతో ఎస్సీ కమ్యూనిటీ హాళ్ళు, అంబేద్కర్ భవనాలు/విగ్రహాలు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాలెడ్జి టవర్, నింబోలి అడ్డా కాచిగూడలో బాబు జగ్జీవన్‌రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తాం. గిరిజన గ్రామాల్లో ఆదివాసి సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు ఈ ఏడాది 50 వేల ప్రభుత్వ సంస్థలకు టి -ఫైబర్ ద్వారా సురక్షితమైన హైస్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించడం, ఆసరా కోసం చూసే బలహీనులను ఆదుకోవడం, నీడ లేని వారికి నీడ కల్పించడం, పంట పొలాలకు నీళ్లు పారించడం, ఫలసాయం పెంచడం, కష్టపడే వారికి పని కల్పించడం, ఇష్టపడేలా పాలన అందించడం, పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి అన్న మహాత్మా గాంధీ మాటలను ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రెండేళ్ల తమ పాలన, పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్. ఈ బడ్జెట్ ఒక సుందరమైన సుసంపన్నమైన ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే బ్లూ ప్రింట్ ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుతున్నా.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *