– దిల్లీ నాయకత్వం పిలుపు కోసం ఎదురు చూస్తున్నా
– గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ వార్తల్లోకి వొచ్చారు. ఎప్పటికైనా సొంతింటికి వెళ్లక తప్పదని చెప్పారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే ఏదో ఒక రోజు అతను ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుందన్నారు. అలాగే తాను కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా తన ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేనంటూ దాటవేశారు. తాను బీజేపీకినిజమైన సైనికుడిని అని తెలిపారు. దిల్లీ లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజున తిరిగి పార్టీలోకి వొస్తానని తేల్చి చెప్పారు. ఇంతకు ముందు కూడా తాను ఇదే అభ్యర్థన చేశానని.. ఇప్పుడు కూడా అదే అభ్యర్థన చేస్తున్నానని చెప్పారు. అసెంబ్లీలో స్వేచ్ఛ కల్పించాలని, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇవ్వాలని.. అప్పుడే బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి రాగలదని రాజాసింగ్ అన్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా తనకు దిల్లీ పెద్దల నుండి లేదా రాష్ట్ర పెద్దల నుంచి పిలుపు వస్తుందని ఖచ్చితంగా తెలుసని చెప్పారు. వారి నుంచి ఫోన్ వస్తే తాను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తానన్నారు. తమకు పార్టీ పెద్ద నాయకులు నుంచి స్వేచ్ఛ ఇవ్వండి అని కోరతానని చెప్పారు. అలా స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలతో తాము ఏ విధంగా యుద్ధం చేస్తామో అంతా చూస్తారని రాజాసింగ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కొంతకాలం క్రితం బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరకుండా ఒంటరిగానే ఉన్నారు. అయితే ఇటీవల ఆయన తిరిగి మళ్లీ బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విషయమై పార్టీ అగ్రనేతలతో చేసిన చర్చలు సఫలమైనట్లు కూడా తెలుస్తోంది. నెల రోజుల్లో ఆయన కాషాయ కండువా కప్పుకోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




