హిల్ట్‌ పాలసీ జీవోను నిలిపివేయించండి

– గవర్నర్‌కు బీజేపీ బృందం వినతిపత్రం సమర్పణ
– ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా 7న మహా ధర్నా
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: హిల్ట్‌ పాలసీ జీవో నెం.27ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకుల బృందం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు మెమొరాండం సమర్పించింది. ఈ పాలసీ ప్రకారం ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 22 ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్‌లోని 9,292 ఎకరాల భూమి బహుళ అవసరాల కోసం మార్పు కానుండడంతో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రామచందర్‌రావు తెలిపారు. మార్కెట్‌ విలువకు తక్కువగా 30-50 ఎస్‌ఆర్‌ఓ రేట్లే విధించడం ద్వారా భూములు ప్రైవేట్‌ రియల్టర్స్‌ నెట్‌వర్క్‌కు తక్కువ ధరలో వెళ్లే అవకాశాలున్నాయని, ఇది అతిపెద్ద కుంభకోణానికి తెరదీసే ప్రక్రియనేనని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈనెల 7న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పాలసీతో భారీ కుంభకోణానికి మార్గం సుగమమవుతోందని తెలిపామన్నారు. ఇటీవలే హైదరాబాద్‌ పరిసరాల్లో ఒక ప్రైవేట్‌ సంస్థ ఒక ఎకరాన్ని రూ.150-151 కోట్లకు కొనుగోలు చేసింది. ఇలా భూముల నిజమైన మార్కెట్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్న సందర్భంలో హిల్ట్‌ పాలసీ ప్రకారం పారిశ్రామిక భూములను కేవలం ఎస్‌ఆర్‌వో రేట్లలో 30% మాత్రమే చెల్లించి బదిలీ చేసుకునే అనుమతి ఇవ్వడం తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. అదే సమయంలో ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలు కూడా ఈ పాలసీలోకి చేరే అవకాశం ఉంది. అలా జరిగితే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులు వేల సంఖ్యలో తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం తలెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లోని రైతులు తమ భూములను కూడా బహుళ ప్రయోజనాల కోసం మార్పిడి చేయండని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ పరిశ్రమల భూములు మాత్రమే రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం వెంటనే కన్వర్ట్‌ చేయడం ఏమిటని రామచందర్‌రావు నిలదీశారు. రైతుల హక్కులను పట్టించుకోకుండా కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికే ప్రాధాన్యత ఇచ్చేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందా అనేది ప్రజలు ఆలోచించాల్సిన విషయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాలు అన్నీ కేవలం మాటలకే పరిమితమయ్యాయని, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. హిల్ట్‌ పాలసీ, జీహెచ్‌ఎంసీ విస్తరణ, కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన వైఫల్యాలు అన్నింటినీ ప్రజల ముందు బహిర్గతం చేస్తామన్నారు. మీ హక్కులు, మీ భవిష్యత్తు రక్షణ కోసం జరగబోయే ఈ పోరాటంలో అందరూ తప్పకుండా పాల్గొనాలని రామచందర్‌రావు ప్రజలను కోరారు. తాము సమర్పించిన మెమొరాండంపై గవర్నర్‌ వర్మ స్పందించారని, దీనిపై ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతంరావు, వీరేందర్‌ గౌడ్‌, వేముల అశోక్‌, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్‌.వి.సుభాష్‌, జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ శంకర్‌ యాదవ్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ రాధాధీరజ్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *