– ప్రజల మద్దతు ఎవరికుందో తేలుతుంది
– ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: పంచాయతీ ఎన్నికల్లో 66శాతం ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేసిన మాట నిజమైతే మీ పార్టీలో చేర్చుకున్న పదిమంది బీఆర్ఎస్ ఎమ్మల్యేల చేత రాజీనామా చేయించి తక్షణమే ఉప ఎన్నికల బరిలో దిగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో మాట్లాడుతూ ఐదు నిమిషాలకో మాట మార్చే ఘనుడు ఈ ముఖ్యమంత్రి అని విమర్శించారు. పదవుల కోసం గబ్బిలాల్లా వేలాడుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలను చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. బయట కాంగ్రెస్ లో చేరామని చెప్పి కడియం, పోచారంలు స్పీకర్ ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. గతంలో మంత్రులుగా, స్పీకర్‌లుగా పనిచేసిన వీరు కేవలం గడ్డిపోచ లాంటి పదవుల కోసం దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి స్పీకర్ ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు ఆడక తప్పలేదని ఆరోపించారు. ఇక ఆ పదిమంది ఎమ్మెల్యేల బతుకు పూర్తిగా ఆగమైపోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లారు. కాంగ్రెస్ దౌర్జన్యాలను ఎదిరించి సిరిసిల్లలో 80 పంచాయతీల్లో గులాబీ జెండా ఎగరేసినట్లు తెలిపారు. రైతులను, మహిళలను మోసం చేసినందుకే కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైందన్నారు. పల్లెలు బాగుపడాలంటే కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ప్రజలు తేల్చి చెప్పారన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రిపేర్ కండి
పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లు గెలవలేదని, ఇప్పుడు 80 గ్రామాల్లో బీఆర్‌ఎస్ గెలిచిందని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సమావేశమైన కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి.. పగలు, పంచాయితీలు పక్కనబెట్టి కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారని కేటీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల రెండు వైపులా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే నిలబడ్డారని తెలిపారు. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయని, గ్రామ పంచాయతీకి, మండల పరిషత్‌కు అనుసంధానకర్త ఎంపీటీసీ అని చెప్పారు. అలాగే జిల్లా పరిషత్‌కు, మండల పరిషత్‌కు సమన్వయకర్త జడ్పీటీసీ అని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పల్లెపల్లెనా డంపింగ్ యార్డులు, ప్రగతి వనాలు ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక పల్లెలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. సిరిసిల్లలో ఉన్న 57 ఎంపీటీసీ స్థానాలు గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని, అందరూ కలిసి కాంగ్రెస్‌పై కొట్లాడాలని పిలుపునిచ్చారు. గులాబీ గెలుపును చూసి కాంగ్రెస్ పరేషాన్ అయితోందన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు ధైర్యంగా ఉండాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. పాత తరం నాయకులు కొత్త తరాన్ని కలుపుకుంటూ ముందుకుపోవాలనిసూచించారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పటికప్పుడు మాటలు మారుస్తున్నారని, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదట 66 శాతం సర్పంచ్ స్థానాలు గెలిచామని చెప్పారని, వెంటనే మాటమార్చి స్థానిక ఎన్నికలతో పార్టీకి సంబంధం లేదంటున్నాడని విమర్శించారు. ఆయనలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మాటలు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారని, ఇప్పుడు మాటమార్చి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెబుతున్నారని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో వారున్నారని విమర్శించారు. గడ్డిపోచలాంటి పదవి కోసం చూరుకు గబ్బిలాల్లా వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. గెలుపు కోసం కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలు మాత్రం బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ ప్రభంజనమే అందుకు నిదర్శనమని చెప్పారు. సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే, ఎంపీలు అయినా ప్రజల కోసమే పనిచేయాలన్నారు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలని సూచించారు. ఐదు అంచెల్లో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారని గుర్తుచేశారు. కేంద్రం పైసలు ఇయ్యకున్నా రాష్ట్ర నిధులు ఉంటాయని తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులు ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయని పేర్కొన్నారు. దాన్ని ఆపే హక్కు ఎమ్మెల్యేలకు లేదు.. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఉండదని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



