గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా హైదరాబాద్

– రెడీ టు వర్క్‌ ఫోర్స్‌గా తెలంగాణ యువత
– ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ ఎకో సిస్టం
– హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ఐటీ మాత్రమే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరోస్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్, డీప్ టెక్, రిటైల్ తదితర రంగాల్లోనూ హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. అందుకోసం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతను రెడీ టు వర్క్‌ఫోర్స్‌గా తీర్చిదిద్దడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అంతర్జాతీయ బీమా దిగ్గజం హార్ట్‌ఫోర్డ్ 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1200మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ను ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ విస్తరణలో భాగంగా రెండు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన హార్డ్‌ఫోర్ట్ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం ఇక్కడి ప్రతిభకు, డిజిటల్ ఇంజనీరింగ్‌లో మన నాయకత్వానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. ఈ కేంద్రం ద్వారా ఏఐ, రిస్క్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఆధునిక బీమా రంగంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని అన్నారు. నగరంలో ఇప్పటికే 400కుపైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ జాబితాలో మారియట్, మెక్‌డొనాల్డ్స్, యూబీఎస్, డాజన్, వాన్‌గార్డ్, ఎలీ లిల్లీ, హెచ్ సీఏ హెల్త్ కేర్, సిటిజన్స్ బ్యాంక్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిని కేవలం బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్‌కు పరిమితం చేయకుండా గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా మార్చేలా అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పారదర్శక పాలన, సమర్థవంతమైన నాయకత్వం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో సంస్కరణలు, ఆధునిక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తదితర అంశాలు హార్ట్‌ఫోర్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణను తమ గమ్యస్థానంగా ఎంచుకునేందుకు దోహదపడుతున్నాయన్నారు. ఈ కార్యాలయం యూఎస్‌లోని హార్ట్‌ఫోర్డ్, చికాగో, షార్లెట్, కొలంబస్‌లో ఉన్న టెక్నాలజీ కేంద్రాలకు అనుబంధంగా పనిచేస్తూ ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అడ్వాన్సుడ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారిస్తూ ‘ఇంజనీరింగ్ ఎక్స్ లెన్స్ హబ్‌’గా పనిచేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. కార్యక్రమంలో హార్ట్‌ఫోర్డ్ ప్రెసిడెంట్ మోరిస్ టూకర్, చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ క్లైర్ బర్న్స్, సీఐవో శేఖర్ పన్నాల, హార్ట్‌ఫోర్డ్ ఇండియా ఎండీ అండ్ హెడ్ సూర్య తమ్మిరాజు, సీటీవో ఇమ్రాన్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *