హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 5ః రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై అధికారులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అడిషనల్ డిజిపిలు మహేష్ ఎం భగవత్, డీఎస్ చౌహాన్, అగ్నిమాపక శాఖ డిజీ విక్రమ్ సింగ్ మాన్, టిజిఐఐసి ఎండి శశాంక్, ఐజిపి (పి & ఎల్) ఎం.రమేష్ లతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపిమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సుమారు 3 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు గ్లోబల్ సమ్మిట్ కు రానున్నారని తెలిపారు. ఆహ్వానితులకు మాత్రమే డిసెంబర్ 8, 9 తేదీలలో అనుమతి ఉంటుందని గుర్తు చేశారు. ఆ తర్వాత నాలుగు రోజులు మాత్రం సాధారణ ప్రజలకు కూడా అనుమతి ఉంటుందన్నారు. విఐపి ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత ఉంటుందని గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో అడుగడుగునా నిఘా పెట్టేందుకు సుమారు వెయ్యికిపైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిని సెంట్రల్ పోలీసు కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తామని తెలిపారు. రేపు సాయంత్రంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు.బందోబస్త్ విషయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తునందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ కి కావాల్సిన సదుపాయాలపై, బేరక్స్, మెస్, కిచెన్, మరుగుదొడ్లవంటి మౌలిక సదుపాయల గురించి అధికారులతో చర్చించామని పేర్కొన్నారు.ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సుమారు వెయ్యి మంది ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నామని వివరించారు. రహదారుల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ వంటి వాటి కోసం ట్రాఫిక్ మార్షల్స్ పనిచేస్తారన్నారు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు జరగకుండా ఆయా మార్గాలను పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని, సాధారణ ప్రజలు, ఇతర వాహనదారులకు రెండు రోజుల పాటు ఆయా మార్గాలలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





