– ఇప్పటికే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి
– దేశవిదేశాలకు నాణ్యమైన విత్తనాలు ఇక్కడినుంచే
– సీడ్‌మెన్ అసోసియేషన్ వార్షికోత్సవంలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో గ్లోబల్ సీడ్ క్యాపిటల్‌గా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి త్రుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం జరిగిన సీడ్‌మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత పాతికేళ్లుగా సీడ్‌మెన్ అసోసియేషన్ రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య బలమైన వారధిగా నిలిచిందని అభినందించారు. నాణ్యమైన విత్తనాల తయారీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, ఏటా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోటి క్వింటాళ్ల విత్తనాలలో 75 లక్షల క్వింటాళ్లు వరి, 10 లక్షల క్వింటాళ్లు మొక్కజొన్న, మరో 10 లక్షల క్వింటాళ్లు జొన్నలు, చిరుధాన్యాలుగా ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. ప్రస్తుతం దాదాపు 8 లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి సాగుతోపాటు 3.5 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రంగంలో భాగస్వాములవుతున్నారని తెలిపారు. యేటా రూ.2,000 కోట్ల విలువైన లక్ష టన్నుల విత్తనం రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతోందని, ప్రభుత్వ కఠిన నిర్ణయాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ విత్తనాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.30లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ భవిష్యత్తులో మరింత విస్తరించి రాష్ట్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనుందని స్పష్టం చేశారు. రాబోయే పాతిళ్లలో క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని సీడ్‌మెన్ అసోసియేషన్‌కు సూచించారు. నిజాయతీగా పనిచేసే విత్తన కంపెనీలను ప్రోత్సాహించడం, నకిలీ విత్తనాలనుంచి రైతులను రక్షించడం రెండూ ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. సీడ్ ఇండస్ట్రీ అభివృద్ధికి అవసరమైన అన్ని సహకారాలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతేడాది తెలంగాణలో నిర్వహించిన వరల్డ్ రైస్ సమ్మిట్, ఇటీవలి ఇండో-ఆఫ్రికన్ సీడ్ సమ్మిట్‌ల ద్వారా రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గుర్తుచేశారు. 1995 నుండి రైతులు, కంపెనీలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల మధ్య అనుసంధానంగా పనిచేస్తూ విత్తన రంగానికి విశేష సేవలందించినందుకు సీడ్‌మెన్ అసోసియేషన్‌ను మంత్రి అభినందించారు. వాతావరణ మార్పులకు తట్టుకునే కొత్త హైబ్రిడ్ల అభివృద్ధికి పరిశోధనలో పెట్టుబడులు పెంచాలని, ఆహార ధాన్యాలే కాకుండా ఉద్యాన పంటలకు ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే కూరగాయ విత్తనాలను రూపొందించాలని మంత్రి సూచించారు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు విత్తన ఎగుమతులు విస్తరించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం-విశ్వవిద్యాలయాలు-పరిశ్రమ-రైతులు కలిసి బలమైన భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని పిలుపునిచ్చారు. హెచ్‌టీ రకం పత్తి విత్తనాల వషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అవి అమ్మే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హెచ్చరించారు. కార్యక్రమంలో సీడ్‌మెన్ అసోషియేషన్ సభ్యులు, వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





