– ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం కృషి
– రాష్ట్రంలో తోషిబా రూ.347 కోట్ల పెట్టుబడి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 8: తెలంగాణను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా(global manufacturing hub) మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridharb abu) అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోషిబా (Toshiba) ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రూ.347 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజతోపాటు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీఆర్జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, సర్జ్ అరెస్టేర్ యూనిట్లను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆనతి కాలంలోనే తెలంగాణ తయారీ రంగంలో దేశానికి దిక్సూచిగా మారిందని, 2024-25లో ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ రూ.2.77లక్షల కోట్లు కాగా ఇందులో 48 శాతం వాటా తయారీ రంగానిదేనని, తొమ్మిది నెలల్లోనే రూ.లక్ష కోట్ల విలువైన మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ రాష్ట్రం నుంచి జరిగాయని, జీఎస్‌డీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని వివరించారు. 2040 నాటికి దేశీయ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని ఆర్థిక సర్వే(2024-25) లెక్క తేల్చిందని, ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకొని రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని తెలిపారు. తెలంగాణను రెన్యువబుల్స్ ఇంజిన్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే సంకల్పంతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ను తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే క్లీన్ ఎనర్జీలో రూ.29వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని, 2030 నాటికి న్యూ రెన్యువబుల్ కెపాసిటీని 20వేల మెగావాట్లకు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని శ్రీధర్‌బాబు చెప్పారు.
ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్‌మెంట్ జోన్లు
బ్యాటరీలు, పవర్ కాంపోనెంట్స్, స్మార్ట్ గ్రిడ్స్ తదితర రంగాల్లో తోషిబా వంటి దిగ్గజ సంస్థలను తెలంగాణాకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయబోతున్నామని, స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం తోషిబా-తెలంగాణ ఆర్‌అండ్‌డీ హబ్‌కు శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. క్లీన్ టెక్, సెమీ కండక్టర్స్, రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్‌లో పెట్టుబడులకు తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ వేదిక ద్వారా జపాన్ కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు.
దుష్ప్రచారానికి దీటైన సమాధానం తోషిబా
కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ, జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటుండ గా కొందరు కావాలని వాటిని ఉత్తుత్తి ఎంవోయూలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విమర్శలకు ఈరోజు మేం కాదు.. తోషిబా కంపెనీనే మీకు దీటైన సమాధానం ఇస్తోందన్నారు. ఈ ఏప్రిలోలో జపాన్ పర్యటనలో రూ.562 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తోషిబా కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందని, బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌తో ఈరోజు రూ.177 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ జరుపుకున్నామని, రూ.65 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, రూ.105 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్‌ను ప్రారంభించామని వివరించారు. ఈ పెట్టుబడులతో ఎనర్జీ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ అండ్ డెవలప్‌మెంట్ మంత్రి క్యోకో హొకుగో, తోషిబా కార్పొరేషన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి కనెటా, సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.





