గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిటల్ గా తెలంగాణ

-‍ గేమ్ ఛేంజర్ గా ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ
– టెక్నాలజీ డిగ్రీలకే పరిమితం కావొద్దు
– దేశ సేవ, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలి
– బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ లో మంత్రి శ్రీధర్ బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః తెలంగాణ‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిట‌ల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా దేశ సేవకు, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలన్నారు. బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్‌లో శనివారం బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ 2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇతర దేశాలు ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ పరిశోధనలకు గొప్ప ఊతమిస్తోందని అన్నారు. త్వరలో ప్రారంభించబోయే తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీలు గేమ్ ఛేంజర్‌గా మారి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తాయన్నారు.

ఇంటెలిజెన్స్ కంటే కో ఆర్డినేష‌న్ అత్యంత ఖ‌రీదైన‌ది

ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంటెలిజెన్స్ కంటే కో-ఆర్డినేషన్ అత్యంత ఖరీదైనదిగా మారిందన్నారు. ఏఐ వినియోగంలో డేటా ప్రైవసీ, ఎథిక్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఆర్ అండ్ డీపై దృష్టి సారించాలని టెక్ కంపెనీలను కోరారు. ఒకప్పుడు స్కేల్, స్పీడ్, వాల్యుయేషన్ ప్రాతిపదికన కంపెనీల సక్సెస్ నిర్ణయించబడేదని, ఇప్పుడు ఆర్కిటెక్చర్, డేటా ఓనర్ షిప్, డెసిషన్ స్పీడ్, నమ్మకంపైనే వాటి మనుగడ ఆధారపడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో కేవలం కోడింగ్ తెలిసిన వారి కంటే సమస్య మూలాలను గుర్తించి పరిష్కరించగల క్రియేటివ్ థింకర్స్ కే జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.

ఏఐ ఫ‌లితాలు గ్రామీణ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపాలి

ఏఐ ఫలితాలు నగరాలకే పరిమితం కాకూడదని, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లోని గ్రామీణ సమస్యలకు పరిష్కారం చూపేలా పరిశోధనలు జరగాలని సూచించారు. అప్పుడే టెక్నాలజీ ఫలాలు సామాన్యులకు కూడా అందుతాయన్నారు. తెలంగాణ రైజింగ్ లో భాగస్వామ్యం కావాలని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులను, యాజమాన్యాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఏఐ, ఇన్నోవేషన్, అకడమిక్ రీసెర్చ్ వంటి అంశాల్లో బిట్స్ పిలానీతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో బిట్స్ అలుమ్ని అసోసియేషన్ చైర్ పర్సన్ ప్రేమ్ జైన్, మ్యాప్ మై ఇండియా ఫౌండర్ అండ్ చైర్మన్ రాకేష్ వర్మ, బీజీఎం 2026 ఛైర్ పర్సన్ అనిత తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *