మా డ‌బ్బులు తిరిగి ఇవ్వండి

– ఓట‌ర్ల‌పై ఒత్తిడి తెస్తున్న ఓడిన అభ్యర్థులు
– ఓట్లు వేశామంటున్నారుగా.. ప్ర‌మాణం చేయండి

నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్తులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తమను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ఓటర్లను కోరారు. అంతేకాక ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ కొందరు అభ్యర్థులు ఓటమిని చవిచూశారు. దీంతో ఆ అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చివరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులను తమకు తిరిగి ఇచ్చేయాలంటూ ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఓ సర్పంచ్‌ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయాడు. దేవుడి ఫోటోతో ఇంటింటికీ తిరుగుతూ తన డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాడు. జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో ఓడిపోయానని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని గ్రామస్తులను కోరుతున్నాడు. అయితే ప్రజలు మాత్రం అతడికే ఓటు వేసినట్లు చెబుతున్నారు. దీంతో ఓట్లు వేశామని చెబుతున్న ఓటర్లను దేవుడిపై ప్రమాణం చేయించుకుంటున్నాడు సదరు అభ్యర్థి. అందరూ తనకే ఓట్లు వేస్తే ఎలా ఓడిపోయానంటూ ఓటర్లను నిలదీస్తూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఈ ఎన్నికల కోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశానని బాధితుడు వాపోతున్నాడు. మరికొన్ని గ్రామాల్లో కూడా ఓడిపోయిన అభ్యర్థులు ఇలానే తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతామంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో కూడా కొందరు అభ్యర్థులు రోడ్డున పడ్డారు. డబ్బులు తీసుకుని తమకు ఓటేయలేదని వాపోతున్నారు. రెండు, మూడో విడతల్లో కొన్ని పంచాయతీలు ఎకగ్రీవాలు కాగా పోటీ ఉన్నచోట సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అంతులేని హావిూలతోపాటు, మందు, విందులతోపాటు, మహిళలకు చీర, సారెలను అందజేస్తున్నారు. అంతేకాక ఓటుకు రూ.2 వేలు ఇస్తామని హావిూ ఇస్తుండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే వరి కోతలు పూర్తికావటంతో అందరూ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మరో పక్క పోటీలో ఉన్న గ్రామాల్లో కొందరు యువత విజయంపై బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో మందు, విందు, డబ్బులు అందలేదని ఓటర్లలో ఆనందం కానరావడంలేదు. ఓడిన వారు ఏడిస్తే గెలిచిన వారు ఇంటికి వచ్చి ఏడ్చిన మాదిరి తమ పరిస్థితి ఉందని ఏకగ్రీవాల్లో సర్పంచ్‌లైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవం చేస్తాం.. గ్రామాభివృద్ధికి కొంత మొత్తం ఇవ్వాలని పెద్ద మనుషులు సూచించటంతో తాము డబ్బులిచ్చామని, ఎన్నికయ్యాక ఓటర్లు నగదు, మందు, విందులు చేయాలని అడుగుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *