– కేబినెట్ ముందుకు ఘోష్ కమిషన్ నివేదిక
– నివేదికను పీపీటీ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కేబినెట్ ముందుంచారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజీల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని ఘోష్ నివేదిక ప్రస్తావించింది. ఆయనతో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావునూ బాధ్యునిగా వేలెత్తి చూపింది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని సూచించిన నిపుణుల కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారని కూడా తేల్చిచెప్పింది. 665 పేజీల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేసి 60 పేజీల సారాంశాన్ని తయారు చేసి ఆదివారం సాయంత్రం కేబినెట్‌కు సమర్పించారు. ఆ సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసిఆర్, 19సార్లు హరీష్‌రావు, ఐదుసార్లు ఈటల పేరు ప్రస్తావనకు వచ్చింది. బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందని, కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. ఆర్థిక మంత్రి ఈటల ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని తప్పుపట్టింది. కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైన కాళేశ్వరం బోర్డు అధికారులపై క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చర్యలు తీసుకోవాలని సూచించింది.




