– 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలనే తీసుకున్నారు
– మొత్తం నివేదికను అసెంబ్లీలో పెడితే నిలదీస్తాం
– మాకు నోటీసులు రాకముందే లీకులు ఇస్తున్నారు
– కక్షసాధింపులకు పాల్పడుతున్న రేవంత్
– మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం
– ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు’పై పీపీటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: కాళేశ్వరంపై ప్రాజెక్టులో అవకతవకలపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ కుట్ర పూరితంగా జరిగినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. వాస్తవాలు లేకుండా వండి వార్చిన రిపోర్టును బయటపెట్టారని, బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు మూడుసార్లు కుప్పకూలింది.. అక్కడికి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నించారు. మేడిగడ్డలో చిన్న ఘటన జరగగానే ఇక్కడికి వచ్చిందన్నారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల రిపోర్టును అసెంబ్లీలో పెడితే ప్రభుత్వాన్ని నిలదీస్తామని, వాస్తవాలను ప్రజల ముందుంచుతామని హరీష్‌రావు అన్నారు. నివేదికలో వారికి నచ్చిన అంశాలనే బయటపెట్టారన్నారు. ఒకవైపే చూసి, విని, నిలబడి ఇచ్చిన రిపోర్టు ఇది.. బేస్‌లెస్ రిపోర్ట్ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నో కమిషన్లు ఎంతోమందిపై వేశారు.. అవి న్యాయస్థానాల ముందు నిలబడలేదని చెప్పారు. కేసీఆర్‌ను హింసించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దేశమన్నారు. పాలనను గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారని, ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేశారని ఆయన తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించారని, పెండిరగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు. నువ్వు వచ్చినంక ఒక్క కాలువ తవ్వినావా.. ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చావా.. రెండేళ్లలో దిల్లీకి కమీషన్ల మూటలు తీసుకెళ్లావు .. వచ్చే రెండేళ్లలో కూడా చేసేదేమీలేదు.. అని సీఎం రేవంత్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.
అక్కడ పేచీ ఉన్నందునే మేడిగడ్డకు మార్చాం
కాళేశ్వరం ముమ్మాటికీ వరప్రదాయినే.. రేవంత్‌కు కూడా తెలుసు.. కాళేశ్వరం కూలిందన్నోడు గంధమల్లకు కొబ్బరికాయ ఎట్ల కొడతాడు.. మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకొస్తానని ఎలా చెబుతున్నాడు అని నిలదీశారు. కేసీఆర్ వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం నిర్మించారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడి లెక్క మాట్లాడుతున్నారు.. ప్రాణహిత-చేవెళ్లలో పెట్టిన ఖర్చు రూ.3,700 కోట్లు మాత్రమే.. రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నాడన్నారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు.. జీవ సంపద ఉంది, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు ఉన్నాయి.. అందుకే అక్కడ ప్రాజెక్టు కట్టలేదని హరీష్‌రావు చెప్పారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పింది.. తమ్మిడిహట్టి దగ్గర చెప్పిన 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉంది.. మేడిగడ్డకు మార్చడం మా నిర్ణయం కాదని చెప్పారు. ప్రాణహిత- చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్తోంది కానీ నీటి లభ్యత లేదని ఉమాభారతి అదే లేఖలో మరో పేరాలో పేర్కొన్నారని హరీష్‌రావు తెలిపారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించవద్దని మహారాష్ట్ర స్పష్టంగా చెప్పిందని, ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే తమ్మిడిహట్టి నుంచి మార్చామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి రహస్యం లేదు.. అన్ని అంశాలు డీపీఆర్‌లో ఉన్నాయి.. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయి.. ఒక ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయి.. మరి కమిషన్ కేంద్రం, అనుమతులు ఇచ్చిన ఏజెన్సీలను కమిషన్ తప్పుబడుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఐదుగురు నిపుణులతో వేసిన కమిటీ కూడా మేడిగడ్డను సూచించిందన్నారు. మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారని నిపుణుల కమిటీనే కమిషన్‌కు చెప్పిందని హరీష్‌రావు చెప్పారు. కాటన్ బ్యారేజీ కట్టినా కమిషన్ వేసి వేధించారు.. అయినా ఆయన గోదావరి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు.. కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతారు అని చెప్పారు.




