జీహెచ్‌ఎంసీ పౌర సేవలు ఇక ఒకే వేదికపై

– పౌర సమస్యల పరిష్కారానికి ‘మై క్యూర్’ యాప్ ప్రారంభం
– అన్ని ఫిర్యాదులకు ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం
– రియల్‌టైమ్ ట్రాకింగ్‌తో ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం
– పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనకు కొత్త అడుగు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: సాంకేతికత దన్నుగా నగర పాలనను మరింత బలోపేతం చేస్తూ పౌర కేంద్రిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ జీహెచఎంసీ ‘మై క్యూర్’ యాప్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. నగరంలోని పౌర సేవలను సులభతరం చేసి ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ఈ యాప్ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న మై జీహెచఎంసీ యాప్‌కు బదులుగా రూపొందించిన మై క్యూర్ యాప్ ద్వారా అన్ని పౌర ఫిర్యాదు సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులకు అనుకూలంగా రూపొందించిన ఇంటర్‌ఫేస్, ఫిర్యాదులపై తక్షణ స్థితిగతుల సమాచారం, పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం వంటి సదుపాయాలతో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమని వెల్లడించారు. శానిటేషన్, వీధి దీపాలు, రహదారులు, కాల్వలు, టౌన్‌ప్లానింగ్ తదితర అంశాలపై పౌరులు నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. వాటి పరిష్కార స్థితిని యాప్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుంటుంది. ఫీల్డ్‌స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయం సాధించేలా బ్యాక్ ఎండ్ వ్యవస్థను అనుసంధానించామని అధికారులు తెలిపారు. కేంద్రీకృత డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షణ సులభమవడంతోపాటు పనితీరు అంచనా వేయడంలో కూడా ఇది దోహదపడుతుందన్నారు. పౌర సేవలన్నింటినీ ఒకే డిజిటల్ వేదికపై సమీకరించే ‘వన్ స్టాప్ సొల్యూషన’గా ఈ యాప్ పనిచేస్తుందని, కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అధికారులు వివరించారు. నగర ప్రజలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ సమస్యలను నమోదు చేసి వేగవంతమైన, పారదర్శక పరిష్కారానికి సహకరించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ (గూగుల్ ప్లే స్టోర్), ఆపిల్ ఐఓఎస్ (యాప్ స్టోర్) వేదికలపై అందుబాటులో ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *