బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, జులై 16: ప్రతి డివిజన్, మండల స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఘట్‌కేసర్ డివిజన్/మండల అధ్యక్షుల కార్యశాల ముగింపు సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. గెలుపు బూత్‌లోనే జన్మిస్తుంది అనే ధోరణితోనే ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. పార్టీకి కార్యకర్తలే ప్రాణం. వారిని గుర్తించాలి, గౌరవించాలి, ప్రోత్సహించాలన్నారు. ఒక్కొక్క బూత్ గెలిస్తే ఒక్కొక్క నియోజకవర్గం మనది అవుతుంది. ఒక్కొక్క నియోజకవర్గం మనదైతే తెలంగాణ మొత్తం మనది అవుతుందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి బ్యాంకు ఖాతా అందించడమే కాక ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా మార్చిందని చెప్పారు. ఈ ఖాతాల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకం సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమవుతోందని, దాంతో దళారుల బాధ పూర్తిగా తొలగిపోయిందని వివరించారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక భారీ కుంభకోణాలు చోటుచేసుకోగా ప్రజాసంక్షేమం పట్టింపులేకుండా పోయిందని రామచందర్‌రావు విమర్శించారు.. మోదీ ప్రభుత్వ హయాంలో అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా వంటి పథకాల ద్వారా ప్రతి పేదవాడికి బీమా భద్రత లభిస్తోందని తెలిపారు. ఈ పథకాల కింద తెలంగాణలోనే 48 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని, అంటే దాదాపు కోటి 50 లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ పథకాల ప్రయోజనాన్ని పొందుతున్నారని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు, స్వయం ఉపాధికి వడ్డీ లేని లేదా తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తోందని, ఈ పథకం వల్ల లక్షలాది మంది యువత ఆర్థికంగా స్వావలంబులవుతుండగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయని రామచందర్‌రావు తెలిపారు.




