నువ్వు గింజవైతే! – 2

గాలిబ్ వాక్య వారసత్వం

(గత సంచిక తరువాయి భాగం)

బంధాలు వరుసలు, వావి వరుసల పేర్లు మాయమై, జై శ్రీరాం ఒక్కటే వినిపించే, మత కుమ్ములాటల తన వూరి అనుభవాన్ని, జ్ఞాపకాలన్నీ చేదెక్కాలని నాలుగు వేపపళ్ళు జేబులో వేసుకొచ్చే దురవస్థ ఇంచుమించూ అన్ని పల్లెలదే. మోకాళ్ళమీద, నుదుటిమీద ముద్దాడి  బర్రలు చేసిన నేల తనదైనా  చేదెక్కినందున వ్యతిరేకించుటే. మానవ జాతి జన్మస్థానానికి విలువ ఇవ్వనితనం, పేర్లకు, ఇంటిపేర్లకు విలువ ఇచ్చేతనం, నిర్భయ, ఎల్లమ్మ, హుసేన్ బీ ల హత్యాచారాల మధ్య వ్యత్యాసం చూసే నైజం ఆక్షేపణా, వ్యతిరేకతా తీవ్రమే.మొహబ్బత్ ల మొహమాటాలకు, దుష్మనీల ఖండనలకు లోపాయకారి కవి కాదు గనక.

అట్లా గాలి వీయనీ, కొమ్మ వూగనీ, పువ్వు మధురిమ వెదజల్లనీ- పక్షి ఎగరనీ, గూటిపిల్ల కిచకిచ నేర్వనీ- ఆకాశం విశాలమవ్వనీ, నది గలగలల్లో అడవి ‘ముక్కుపుడక‘తో నవ్వనీ. కవి హృదయ గవాక్షం తెరచి చూస్తే ఈ దృశ్యాలే తారట్లాడుతయి. అడవి అందాలకు ఒక కావ్యమైనా సరిపోతుందా, లేదేమో! అడవి ఒక ప్రేరణ, గుణపాఠం. అడవిని రెండుకోణాలలో దర్శిస్తున్న తీరు చూద్దాం. కోయిల్లు, లేళ్ళు, పక్షులు, పులులు, మేకలు కాసే పిల్ల, చేతిలో కొడవలికి కట్టిన వంకీకర్ర ఒక ఉత్సాహం. ఒక కోణం. పరిక్కంప గాయపర్చకపోతే, రేగుపళ్ళను కొరుకుతూ నడుస్తూ బండరాళ్ళను కొట్టుకొని బొటనవేలు పొట్ట విచ్చకపోతే మరో ఊహించని కోణం ముందుకు తేవటం వెనుక జీవిత పరిపూర్ణత సుస్పష్ట పరచడం వుంది. ముక్కుపుడకను హైటెక్ (బుల్డోజర్) యుగం మింగేస్తున్నదని కవి ఫిర్యాదు.

ప్రాకృతిక పరవశంలో మొక్కజొన్న చేనును కవి అలుముకుంటడు. చంకలో పిల్లనెత్తుకొని తల్లిలా గర్వంగా నిల్చున్న చేను, స్కూల్ పిల్లల డ్రిల్ ను తలపుకు తెస్తది. తన మనవరాలిని అట్లే ఊహించుకోవడం సరదాకి, సంతోషానికి పరాకాష్ట.

గాఢానుభూతి కమ్మేసినప్పుడు, మనసు గట్లుతెగిన తీరం వెంట పరుగులు తీస్తది. అందమైన ఊహలు, జీవనసత్యాలుగా పరిణమిస్తయి, నదిని అక్షరాల్లోకి వొంపని, ఆవాహన చేసుకోని కవి వుండడు. ఈ కవికి నది రెండుసార్లు ఎదురు పడ్డది. ఎదలో పడ్డది. నది ప్రయాణం, కల్లోల ప్రయాణంగా. నదిని ఆలింగనం చేసుకొని, ఉదయకాంతిలో దాని సౌందర్యానికి ఆరాధ్యుడై తన చరిత్రలో నది లీనమైందనే తాదాత్మ్యస్థితికి చేరుతడు. సాయంత్రాన సాక్షిగా తురాయి చెట్టుకు పూసిన పువ్వులా తను వున్నట్టు చంద్రుడు చెబుతున్నాడంటడు. ఇక్కడ కూడా వివక్ష పూరిత కార్డో, చిరునామానో తెరమీదకొస్తుందని, ప్రకృతి భిక్ష అయిన నది అందరిది గదా అని మథన పడుతడు. సహజానందం మొదటి నదితోనైతే, కలల జీవితాన్ని, కదిలేనదిని, కల్లోల ప్రయాణాన్ని పోల్చుతూ తాత్వికచర్చ చేస్తడు. ఈ మూడు ప్రభావాల సారాంశం తీరని దాహంగా వెంటాడుతుందని ముక్తాయిస్తడు.

కాలి చెప్పులకు ఆకారమిచ్చిన ఏ జంతువుకో నివాళి ఇచ్చే సంస్కారం కవిత్వానిది, కవిది. పాతవైనా, కొత్తవైనా దృష్టి అపురూపమే. గడప ముందు విడిచిన చెప్పులు పోయినప్పుడు, విలవిల్లాడినతనం పోయెం నిడివంతా స్పర్శిస్తుంది. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి కాలి గండపెండేరాన్ని అమ్మే సందర్భంలో ‘ఇదీ నా శరీరంలో ఒక భాగమే ననుకున్నా’ అనే దృశ్యం గుర్తొస్తది. బాల్యానికి, యవ్వనానికి పరవశం చందమామ. అద్దంలో చందమామను చూపించి బాలరామునికి గోరుముద్దలు తినిపించిన కథలూ వున్నయి. కవి కలంకింద బిందువులానో సింధువులానో చంద్రుడొస్తడు. ఆధునిక పరిశోధన, శాస్త్ర సాంకేతికం చంద్రమండలం చుట్టుముట్టినప్పుడు ఎన్ని కాలాలుగానో పాదుకొన్న సుకుమార భావనలన్నీ తల్లడిల్లినయి, కఠిననిజాన్ని ఒప్పుకోనంతగా. రియాలిటీ ఏదైనా రియల్ ఎస్టేట్ కాబోతుందా అని మామకు ప్రేమలేఖ సంధిస్తున్నడు కవి. తెనాలి రామలింగని హాస్య చతురత రంగరించిన వాక్యాల జాలు గిలిగింతలు పెడుతది. అత్తగారింటి వారి వరుసలతో పరాచికాలాట నడిపి, మామని కట్నంగా వందల ఎకరాలు అడిగేస్తారేమో, అక్కడ కూడా అలవాటైన మతం, వరకట్న పిశాచాలను మొక్కలుగా నాటుతారేమో అనే ప్రమాద ఘంటికల హెచ్చరిక ఆలోచనల్లో తొలుస్తది.

మనిషి బతుక్కి మొదలు తుది వున్నది గద, కవులకు మొదలుకన్నా తుదిపైనే ఎక్కువ పలవరింతలకు గురి కావడం ఏ విశేషమో. మరణాన్ని కొన్నివరుసలలో పేర్చి చూపిస్తున్నడీ కవి. వణికించే మరణ భయానికి ఒకింత ఊరట. మరణమంటే ‘హమ్’ చేస్తున్న పాట చివరి చరణం పలకడంలా ఎంత తేలిక. నదుల చలనం, గాలిహోరు మౌనం దాల్చడం లాంటి అనుభవం పొందడం. మిత్రుల కాల్ లిస్టు నుంచి డిలీటవడం. రక్త సంబంధీకులు తిరుగాడిన ఇంటిని వాటాలుగా ‘తస్కీం’ చేసుకోవడం. ఈ లౌల్య వ్యవహారికత మామూలే. ఆకాశంనుండి చినుకై నేల రాలడం, ఆవిరై పైకేగడం. ప్రకృతిలోంచి ప్రకృతలోకి. మధురభావన. రోజువారీ రెక్కీ, విఫల సముద్రపుటలలు నెత్తి బాదుకోవటం, అపజయ దుఃఖం, మార్గమధ్యంలో దొరక్కుండా వుండడం, ఇవన్నీ మరణానుభవాలను ‘స్పృహ’గా చెబుతూ, అందమైన సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ ఆ తరుణాన్ని కోల్పోవద్దని, దోబూచులాడే మరణాన్ని చూసి నవ్వాలనిపిస్తుందని స్పోర్టివ్ ఫీల్ తో గుండె బరువును దింపడం చాణక్యత.

ఆశయ సమున్నతుడైన కవి సిరాక్షరాలను, చిరాక్షరాలుగా, శిలాక్షరాలుగా మలచి, ఫలశృతిని ఆశిస్తడు. ‘భారతీయులంతా నా సహోదరులు’ అన్న చిన్నప్పటి వల్లె వేసిన ప్రతిజ్ఞ, పెరిగి పెద్ద కాగానే సమాన హక్కుల శాలువా చీకిపోయిన మనసుల నూలుపోగులతో నేయబడుతూ వుంటే సహించడు. ఒకేబోనులో పులి మేక వైరం సహజమంటే ఊరుకోడు. భారతీయాత్మ ప్రతిష్టాపనకు లౌకిక దేవాలయం నిర్మిద్దాం, అట్నుంచి నువ్వు, ఇట్నుంచి నేను అని ఎలుగెత్తే కల నిజమయ్యే దారిలో కలంధారిగా వేచి వుంటడు. గాలిబ్ ఆత్మ, ప్రసన్న వదనంలోన గింజలా పడి, మొలకెత్తిన పచ్చనాకుల సాక్షిగా పల్లెతనపు కవిత్వ పరిమళంతో, నీడల్ని ఉన్నతీకరిస్తూ వెళ్తున్న కవి హనీఫ్ ని హత్తుకుందాం.

“Lest we forget; it is easy to be

HUMAN, very hard to be HUMANE”

Mirza Galib

(వ్యాసం ముగిసింది)

-దాసరాజు రామారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *