ఐన్ స్టీన్ మేధస్సు,చేగువేరా తెగువ కలబోసిన కడలి 1960ల నాటి విప్లవ జ్వాల జార్జ్ రెడ్డి లాంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. స్వతంత్ర భారతంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛ అందకుండా పోతున్న క్రమంలో సమాజంలోని అపసవ్య ధోరణులను అధ్యయనం చేస్తూ క్యూబా విప్లవ వీరుడు చేగువేరా స్ఫూర్తితో యూనివర్సిటీలలోనే సామాజిక మార్పుకు నాంది పలకాలని విద్యార్థులను చైతన్యం చేసిన ఉస్మానియా క్రాంతి ధార జార్జ్ రెడ్డి.చావు మమ్ములని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎప్పుడైనా రావచ్చు అనే చేగువేరా మాటలను ఉటంకిస్తూ విద్యార్థులకు ధైర్యాన్ని నింపిన విప్లవ తార జార్జ్.తన నడక,నడవడికలతో చేగువేరాను స్పృశింపజేశారు.అన్యాయాన్ని సహించక తిరుగుబాటు చేశాడు.సైద్దాంతికమైన చర్చలతో,ప్రశ్నలతో ఆలోచనలను రేకేత్తించారు.
అంతర్జాతీయ రాజకీయాల చేత ప్రభావితం
1960-70 అది కల్లోల కాలం.కుల,మత ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్న సమయంలో తోటి మనుషుల గురించి తపన పడే మానవతా హృదయాలు నడయాడిన కాలం.గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కొండలు,పర్వతాలలో విప్లవ చిత్రాలను రూపొందిస్తున్న సందర్భం.ఆ విద్యార్థులలో ఉన్న పోరాట పఠిమ వివిధ సందర్భాలలో ఉద్యమాల ద్వారా వ్యక్తమవుతున్న పరిస్థితి.దక్షిణాఫ్రికాలో వర్ణ వ్యవస్థ కు వ్యతిరేకంగా,సోవియట్ విద్యార్థుల తిరుగుబాటు,ఫ్రాన్స్ లో చార్లెస్ డీగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల తిరుగుబాటు,అమెరికాలో బ్లాక్ పాంధర్స్ తిరుగుబాటు,అమెరికాలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజల పోరాటం, స్వదేశంలో నక్సల్బరీ,శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు ఇవి ఆ కాలపు సజీవ సంఘటనలు.ఇలాంటి సందర్భంలో కాలం అసాధారణమైన వ్యక్తులను కడుపుతో కన్నది.ఆ కాలం కడుపులో పుట్టిన బిడ్డ,విప్లవ ధృవతార,హైదరాబాద్
చేగువేరా జార్జ్ రఘునాథరెడ్డి.
తొలి దశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గాలులు ఉస్మానియా యూనివర్సిటీని తాకాయి.ఆ ఉద్యమాల ప్రభావం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులలో కొత్త ఆలోచనలను రేకెత్తించింది.ఈ పరిస్థితులలో ఉస్మానియా యూనివర్సిటి నూతన ఆలోచనలకు,మార్పు కోరే వ్యవస్థకు వేదికైంది.ఆధిపత్య ఆలోచనలతో కొన్ని ఆరాచక.శక్తులు యూనివర్సిటీ లలో వికృత చేష్టలకు పాల్పడుతున్న సమయంలో విద్యార్థులు బిక్కు బిక్కు మంటున్న కాలంలో విద్యార్థి లోకానికి పెద్ద దిక్కు గా ఉస్మానియా యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ విద్యార్థిగా జార్జి రెడ్డి అడుగు పెట్టాడు.క్యాంపస్ లో విద్యార్థుల హక్కులకై, రక్షణకై అండగా నిలబడ్డారు.సైద్దాంతిక అధ్యయనం,చర్చలతో తోటి విద్యార్థులలో స్ఫూర్తి ని నింపారు.అరాచకాలను ఎదురించడానికి అతడు ఇచ్చిన నినాదమే యుద్ధం అయింది.క్యాంపస్ గడ్డపై నిత్యం ఉదయించే కిరణంలా ఉండేవారు,నిరంతరం సామాజిక అంశాలపై అధ్యయనం చేస్తూనే, భౌతిక శాస్త్రంలోని సిద్ధాంతాలను విశ్లేషించడం లో తన మార్క్ ను చూపించారు. భారత దేశ రాజకీయాలు,ఆఫ్రికన్ పోరాటాలు,పాలస్తీనా సమస్యలు,వియత్నాం యుద్దాలపై అనర్గళంగా ప్రసంగించేవారు. మనువాద వర్గాలు చేసే దౌర్జన్యాలను దోపిడిని నిరంతరం వ్యతిరేకించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడ్డారు.సామాజిక స్పృహ తో ప్రగతి శీల భావాలతో ముందుకు కదిలారు.తన ప్రేరేపిత ప్రసంగాల ద్వారా విద్యార్థుల మస్తిష్కాలను మేల్కోలిపి తద్వారా కార్యాచరణ గావించారు.
నాయకత్వానికి చిరునామా జార్జ్
విశ్వవిద్యాలయ రాజకీయాల్లో జార్జ్ రెడ్డి చురుగ్గా ఉండేవారు.కింది కులాలు,చిన్న ఉద్యోగులు,నూతన విద్యార్థుల వంటి బాధితుల పక్షాన ఉండి జార్జ్ పోరాటం చేసేవాడు. ఎవరైనా వచ్చి తన కష్టం చెప్పుకుంటే ముందూ వెనకా చూడకుండా వారి తరపున వెళ్లి అవతలి వ్యక్తిని ఒప్పించో లేక మందలించో సరే బాధితుడికి న్యాయం చేసేతత్వం అతనిది.బాధితుల పక్షాన నిలబడే క్రమంలో ఘర్షణలు జరిగిన సందర్భాలు అనేకం.గాయాలు చేసిన సందర్భాలు,గాయాలైన సందర్భాలు ఉన్నాయి.నాయకులు ముందుగా అనుచరులను పంపి వ్యవహారం చక్కబెట్టమని చెబుతుంటారు.కాని జార్జ్ అలా కాదు.ప్రమాదం ఎక్కడ ఉంటే అక్కడ తానే ముందు ఉండేవాడు. తరువాతే అనుచరులను పిలిచేవాడు.అటువంటి లక్షణం చేగువేరాలో ఉండేది.జార్జ్ రెడ్డి లో కూడా అవే లక్షణాలు అలవర్చుకున్నాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ నిప్పుకణం”జీనా హైతో మర్నా సీఖో! కదం కదం ఫర్ లడ్ నా సీఖో”జీవించాలంటే మరణం గురించి నేర్చుకో, అడుగడుగునా పోరాడటం గురించి నేర్చుకో’అనేది జార్జి ఇచ్చిన నినాదం.’బతకాలంటే మరణించటం నేర్చుకోవాలని దానర్ధం. బతకటమంటే ఊపిరి తీయటమా.! తల్లిదండ్రులు,చుట్టు పక్కల సమాజం ఇచ్చిన ఆర్ధిక, నైతిక మూసలో జీవితాన్ని లాగించటమేనా.! కాదు అంటారు జార్జి వంటి వారు. వాళ్లస్సలు భయపడుతూ బతికే భద్ర జీవితాన్ని ఒప్పుకోరు.తన జీవితంలో తనకి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తారో ఇతరులకి కూడా అంతే సమ ప్రాముఖ్యత ఇచ్చే సంస్కారం గల ఇలాంటి వారు తమ మేథ, శక్తి సామర్ధ్యాలు, నిరంతరం ఒక వంద నక్షత్రాల జ్వలనాన్ని నింపుకునే ఉత్సాహం మొత్తం దోపిడీ పీడనలు, అసమానత్వాలు, ఆధిపత్యాలు లేని సామాజిక సమానత్వానికి అంకితం చేస్తారు. అలా అంకితం చేయాటాన్నే బతకటం అందాం.ఆ నిబద్ధతని జీవితంలో వంద శాతం ప్రదర్శించాలంటే మరణాన్ని కూడా తేలికగా ఆహ్వానించే తత్వం, ప్రవర్తన వుండాలి. అది జార్జి లాంటి వారిలో మాత్రమే దొరుకుతుంది.
జార్జ్ చే ప్రభావితులైన వ్యక్తులు
జార్జి బతికుండగానే తనలాంటి వారిని జమ చేసాడు. కొన్ని సంవత్సరాల పాటు విద్యార్ధిలోకాన్ని స్వయంగా ప్రభావితం చేసాడు. నిజానికి జార్జి తాను అమరుడైనాకే ఎక్కువగా జీవించాడు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వంటి అమరుల నుండి తదనంతర కాలంలో భారత విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషించిన అగ్ర నాయకులు కూడా జార్జి సహచర్యంలో ఎదిగారు.కాని దురదృష్టవశాత్తు ఈ రోజున జార్జి భావజాలానికి ప్రతినిధులున్నారేమో కానీ జార్జి వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు లేరు. బహుజనుల విప్లవ శక్తి మారోజు వీరన్న ఐనా,కొయ్యూరు మృత వీరులలలో ఒకరైన ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, కిషన్ జీ అయిన త్యాగాల చిరునామా ఉస్మానియా విశ్వవిద్యాలయమే.నేటికి విప్లవ భావాలతో జవసత్వాలు నింపుకుని జీవిస్తున్న కూర రాజన్న సైతం ఉస్మానియా ఇంజనీరింగ్ విద్యార్థియే.ఇంకా జ్ఞాత,అజ్ఞాత వీరులెందరో ఉస్మానియా జ్ఞాన పలకంపై ఉదయించిన సూర్యులే.ఈ త్యాగమయమైన చరిత్ర ప్రగతిశీల ఉద్యమాలకు ఎంతో స్పూర్తినిస్తూనే ఉంది.
జార్జ్ స్ఫూర్తిని కొనసాగించటం అంటే
నేడు భారతదేశంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.జార్జ్ వ్యతిరేకించిన సంఘ్ పరివార్,మతతత్వ రాజకీయ పార్టీలు నేడు అధికారంలో ఉన్నాయి.మతమౌడ్యం,మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి.యూనివర్సిటీలు అన్ని వెలివాడలుగా మారుతున్నాయి .సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పెరిగిపోతున్నాయి.విద్య కాషాయికరణ , ప్రయివేటీకరణకు ప్రభుత్వాలు ఉత్సాహం కనబరుస్తున్నారు.ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదు.అమలు చేసే పరిస్థితులు కూడా కనబడటం లేదు.అయినా నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు.అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేసే స్వభావం,సమ సమాజ కోసం పరితపించే మనస్తత్వం,నేటి యువత సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచుకోవటం,ప్రజాతంత్ర, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడడమే జార్జ్ స్ఫూర్తిని కొనసాగించడం.ప్రజలకోసం మరణించినా స్ఫూర్తిగానే జార్జ్ కొనసాగుతున్నాడు.జార్జ్ రేకేత్తించిన ఆలోచనలు, ప్రశ్నలు,మెరుగైన స్వప్నాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.ఆ స్వప్నాలను ఎవరు చిదిమేయలేరు.చావును ఎదిరించి ధిక్కారానికి ప్రతీకగా నిలిచిన జార్జ్ ఎప్పటికైనా చరిత్రను ఎరుపెక్కించిన యోధుడే.
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192





