జీనోవమ్‌ వ్యాలీతో హైదరాబాద్‌కు గుర్తింపు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ప్రభుత్వం మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే తమ నిర్ణయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేట జీనోమ్‌ వ్యాలీలో ఆయన మంగళవారం పర్యటించారు. 1.75 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న ఐకోర్‌ బయోలాజిక్స్‌ పరిశ్రమ కొత్త ప్లాంట్‌(ఫెసిలిటీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ బల్క్‌ డ్రగ్స్‌ రాజధానిగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుందని, దేశంలోనే 33 శాతం వ్యాక్సిన్స్‌, బల్క్‌ డ్రగ్స్‌లో 43శాతం ఇక్కడినుంచే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కోవిడ్‌ సమయంలో జీనోమ్‌ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదని, తమ ప్రభుత్వం మరింత సరళమైన విధానాలతో ముందుకెళ్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ డేటా సిటీగా మారనుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3లక్షల 28 వేల కోట్లు పెట్టుబడులు సాధించామని, ప్రపంచ దేశాలతో పోటీపడాలని, అధునాతన విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, రాబోయే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్‌ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఇందుకు జీనోమ్‌ వ్యాలీ పారిశ్రామికవేత్తల సహకారం ఉండాలని కోరుతున్నామన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణను గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా మార్చేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. ఈ లక్ష్య సాధనలో ‘ఐకోర్‌’ రూపంలో మరో అడుగు ముందుకు పడిరదని, కొత్తగా 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ఇటీవలి కాలంలో తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగం కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌(సీఏజీఆర్‌) 23 శాతం కాగా అదే సమయంలో జాతీయ సగటు కేవలం 14 శాతం మాత్రమేనని తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం వాటా 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఉందని, ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు అని వివరించారు. సీబీఆర్‌ఈ గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ అట్లాస్‌ 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్ల జాబితాలో బోస్టన్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్‌, టోక్యో తదితర నగరాల సరసన హైదరాబాద్‌ చేరిందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ నుంచి ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్న నగరం హైదరాబాద్‌ అని, ఇది మనందరికీ గర్వకారణమని, తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగ వృద్ధికి ఊతమిచ్చేలా అవసరమైన ఎకో సిస్టమ్‌ను నిర్మించడంలో తెలంగాణ ప్రపంచానికి దిక్సూచిగా మారిందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజస్‌ను అభివృద్ధి చేయబోతున్నామని, నెక్స్ట్‌ జనరేషన్‌ బయో-మాన్యుఫ్యాక్చరింగ్‌, సెల్‌అండ్‌ జీన్‌ థెరపీ, ఏఐ ఆధారిత రోగ నిర్థారణ, ఔషధాల ఉత్పత్తి, అరుదైన వ్యాధులపై పరిశోధన, సుస్థిరాభివృద్ధికి అడుగులు పడేలా గ్రీన్‌ కెమిస్ట్రీ, బయో- కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌(సీఆర్‌ఏఎంఎస్‌) తదితర అంశాల్లో తెలంగాణను ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ పటంలో అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారించామని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *