– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: రాష్ట్ర జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వాటా 10 శాతం ఉండేలా తమ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. శంషాబాద్‌లో ఏర్పాటైన గో-నేషనల్-ఎక్స్‌పో-2025 ఐదో ద్వైవార్షిక సదస్సును శనివారం ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. దాదాపు నాలుగు వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నఈ సదస్సును బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బిఎన్‌ఐ) నిర్వహిస్తోంది. రెండు రోజులపాటు ప్రదర్శనతోపాటు వివిధ అంశాలపై సదస్సులు జరుగుతాయి. నూతన సాంకేతికత, డిజిటలైజేషన్లతో ఎంఎస్‌ఎంఇలు ఎప్పటికప్పుడు ఆధునీకరించుకునేలా తమ ప్రభుత్వం సహకరిస్తోందని శ్రీధర్‌బాబు వివరించారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తున్నట్టు తెలిపారు. ఎస్‌ఎంఎస్‌తలలో లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారని, ఇది అత్యంత ప్రాధాన్యతా రంగమని అన్నారు. వచ్చే రెండు నెలల్లో కృత్రిమ మేధ నూతన ఆవిష్కరణల హబ్ ను ప్రారంభిస్తామన్నారు. చిన్న పరిశ్రమల ఉత్పాదనల ఎగుమతులకు రాష్ట్రంలో రెండు డ్రై పోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, హైదబాద్ పశ్చిమాన ముంబై వైపు ఒకటి, తూర్పున కాకినాడ వైపు మరొకటి నెలకొల్పుతామని తెలిపారు. ప్రదర్శనలో 200 ఎంఎస్‌ఎస్‌ఈలు తమ తయారీలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని, పారిశ్రామికవేత్తలంతా ఒక వేదికపై కలుసుకుని పరస్పర సహకారం, భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని, బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషన్ ఈ సంకల్పాన్ని చేపట్టడం ప్రశంసనీయమని శ్రీధర్ అన్నారు. సదస్సులో ఉత్పత్తుల ప్రదర్శన, వివిధ అంశాలపై సమావేశాలతోపాటు బేకింగ్, ఫుడ్ ఇన్నోవేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ స్టయిలింగ్ ఫోటోగ్రఫీ, వాణిజ్య ప్రకటనలపై పోటీలు జరిగాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





