– జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: రానున్న గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కోరారు. ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీన పూర్తి కానున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం కమిషనర్ అధ్యక్షతన సన్నాహక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా జీహెచ్‌ఎంసీ పోలీస్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిjతీ సహకారం అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే నగర పరిధిలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. గణేష్ ప్రతిమల ఊరేగింపు జరిగే జాతీయ రహదారుల్లో ఏమైనా రోడ్ల మరమ్మతులు ఉంటే వాటిని కూడా చేపడతామని చెప్పారు. పోలీస్ శాఖ సూచన మేరకు నిమజ్జనం సజావుగా, వేగంగా పూర్తిచేసేందుకు గత ఏడాది కంటే ఎక్కువ క్రేన్‌లు కూడా ఉపయోగిస్తామన్నారు. ఉత్సవాలకు బడ్జెట్ సమస్య లేదని, వివిధ పనుల నిమిత్తం గతంకంటే కూడా అధిక నిధులు కేటాయిస్తామని, లాజిస్టిక్స్ సమకూరుస్తామని కమిషనర్ ఉత్సవ సమితి సభ్యులకు తెలిపారు. వేడుక సజావుగా జరిగేందుకు జోనల్ పరిధిలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. గత లోటుపాట్లను సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు జరిగేలా చూస్తామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్ గణేష్ ఉత్సవాలు సజావుగా జరిగేందుకు పలు సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం భాగ్యనగర్, ఇతర గణేష్ ఉత్సవ సమితిలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పండుగ సజావుగా జరుపుకుంటున్నామని తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున గణేష్ పండాలు, మండపాల నిర్మాణానికి క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ వైరింగ్‌తో సహా నాణ్యమైన లాజిస్టిక్ ఉపయోగించాలని సూచించారు. ఊరేగింపు సమయంలో ప్రతిమల అధిక ఎత్తుతో ఇబ్బందులు, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందే రూట్ మ్యాప్, వాహనం ఎత్తు ఆధారంగా ప్రతిమలను ప్రతిష్ఠించాలని కోరారు. ప్రతి మండపం వద్ద కనీసం ఒక్క సీసీ కెమెరా అయినా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెద్ద మండపాల్లో ముగ్గురికి తగ్గకుండా వలంటీర్ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు. పెద్ద మండపాలలో సందర్శనం కోసం వచ్చే మార్గాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలోని అన్ని గణేష్ విగ్రహాల ఊరేగింపు సకాలంలో ప్రారంభం అయ్యేలా సహకరిస్తే నిమజ్జనం సజావుగా సాగుతుందన్నారు. అంతకుముందు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గణేష్ ఉత్సవాలు సజావుగా జరిగేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, సీఈ రత్నాకర్, జోనల్ కమిషనర్‌లు, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్, ఆర్టీసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు, హెచ్‌ఎంఎస్, అండ్ ఎస్‌బీ, అగ్నిమాపక, నీటిపారుదల, పర్యాటకం, ఆరోగ్యం, కాలుష్య నియంత్రణ బోర్డు, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు.





