గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ స్వర్ణోత్సవాలలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 13: గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ స్వర్ణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-స్వదేశీ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని మంత్రి సీతక్క అన్నారు. 1500 గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసి వారి త్యాగాన్ని, ఆలోచనా విధానాన్ని దేశానికి, సమాజానికి గుర్తు చేస్తున్నారని, ఎప్పటికైనా భారత దేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామరక్ష అని, శాంతియుత మార్గంలోనే మనకు విజయం వరిస్తుందని, గాంధీ బాటలోనే మనమంతా నడిచి నియంతలను, దుర్మార్గులను తరిమికొటామని గుర్తు చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఆమె చెప్పారు. మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్తున్నామని, అందులో భాగంగా జై బాపూ, జై భీవమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మహనీయుల బాటలో నడిచి ప్రజలకు మేలు చేస్తామని, ఎప్పటికైనా శాంతి సామరస్యతే గెలుస్తాయి.. లాంగ్ లీవ్ గాంధీ అని సీతక్క అన్నారు.


