– హిందూ దేవుళ్లపై రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా..
– అడ్డుకున్న పోలీసులు.. స్వల్ప ఉద్రిక్తత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. గాంధీ భవన్‌లో మంగళవారం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు బుధవారం స్పందిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పే వరకు తాము పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు సైతం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. దీంతో గాంధీ భవన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పు లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. నాయకుల మధ్య ఏమైనా మనస్పర్థలు ఉంటే వాటిని అధిగమించి అందరినీ కలుపుకుని పోవాలనే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను ఉదహరించారని చెప్పారు. అంతేకానీ హిందూ దేవుళ్లను కించపరిచే ఉద్దేశ్యం ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో లేదని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అదీకాక రేవంత్ రెడ్డి పాలనపై విమర్శించేందుకు బీజేపీ నేతలకు ఏ అంశం దొరకలేదని , అందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వారు ఆక్షేపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.