వాణిజ్య పంటలతో లాభాలు గడించాలి

రైతులకు మంత్రి తుమ్మల సూచన

ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 12:  ఆదాయం వొచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రధానంగా వాణిజ్య పంటలతో లాభాలు గడించాలని అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్వహించిన ’మెగా ఆయిల్‌ ‘‌పామ్‌ ‌ప్లాంటేషన్‌ ‌డ్రైవ్‌’ ‌ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు విషయంలో రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. నవంబర్‌ ‌నాటికి పామాయిల్‌ ‌ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని, ఆ దిశగా పనులు పూర్తి చేయాలన్నారు. రిఫైనరీ పనులు కూడా స్థానికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పామాయిల్‌ ‌సీడ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాలు అందిస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. భూసేకరణ పక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా వక్క మొక్కలు నాటామని తెలిపారు. మే నెలలో కురిసిన వర్షాలతో పంటసాగు ప్రారంభించిన రైతులకు ఇబ్బంది కలగకుండా సీతారామ ఎత్తిపోతల పథకం నుంచి జలాలను నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు నేడు విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌ ‌నాయక్‌, ‌రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ ‌రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *