– ఉప ఎన్నికలు జరిపించాలి
– పార్టీ మార్చిన ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శాస్తి తప్పదు
– గద్వాల గర్జన సభలో కె.టి.ఆర్
గద్వాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్‌లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అని కె.టి.ఆర్. సవాల్ విసిరారు. గద్వాల గర్జన పేరుతో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలను, అభిప్రాయాలను తుంగలో తొక్కి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలను మార్చిన ఎమ్మెల్యేలకు ప్రజల కోర్టులో తగిన తీర్పు తప్పదన్నారు. పార్టీలు మారిన ఆ పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉంది. అసలు వాళ్లది ఏ పార్టీ అనేది చెప్పుకోలేని దుస్థితి. స్వార్థం కోసం, ఆస్తులు పెంచుకోవడానికే అవకాశవాదంతో పార్టీ మారారు. ఈ పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా ఉంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన రాష్ట్రంలోని పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. ప్రజలే బుద్ధి చెబుతారు” అని కేటీఆర్ ధ్వజమెత్తారు. వర్షంలోనూ భారీగా తరలివచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, “తెలంగాణ ఉద్యమంలో గద్వాల ముందు వరుసలో నిలిచింది. జోగులాంబ తల్లి ఆశీస్సులతో గద్వాలు జిల్లాగా మారింది. గద్వాలను జిల్లా కేంద్రంగా మార్చడమే కాకుండా మెడికల్ కాలేజీ కూడా తెచ్చాం. తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 18.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. 22 నెలలు అయినా ఇప్పటిదాకా నిర్మాణ పనులను కొనసాగించకుండా గట్టు ప్రాజెక్టును పండబెట్టింది కాంగ్రెస్ అని గుర్తుంచుకోండి” అన్నారు. కేటీఆర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఎవరి అభివృద్ధి కోసం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లాడు? పేదల కోసం అయితే ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైంది? రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ మాయమైంది? ఆడబిడ్డలకు స్కూటీ ఎక్కడ ఇచ్చారు? రఊ.20 లక్షల దళితబంధు ఎక్కడ? బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ ఏమైంది?” ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనచి పార్టీ మారిండా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత కూడా “ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాం” అని చెప్పుకోవడం దారుణమని ఆయన ఎద్దేవా చేశారు. “కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. గ్రూప్-1 ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారు. ప్రజలు నమ్మి ఓటేసి, ఇప్పుడు మోసపోతున్నారు. ఇందుకే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిందా” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.గద్వాల ఎమ్మెల్యే గతంలో చెప్పిన మాటలపై కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్‌లో చేరబోనని, చేరాల్సి వస్తే రైలుకింద తలపెడతానని చెప్పిన ఎమ్మెల్యే ఈ సభకు ఎందుకు రాలేదు? బీఆర్‌ఎస్‌లో ఉన్నానని చెప్పుకుంటూ, కాంగ్రెస్‌కు లొంగిపోవడం ప్రజలను మోసం చేయడమే” అని ఆయన అన్నారు. వేలాదిమంది గద్వాలలో బిఆర్ఎస్ సభలో ఉంటే, బిఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పుకుంటున్న గద్వాల ఎమ్మెల్యే మాత్రం రేవంత్ రెడ్డి సంకలో ఉన్నారని ఎద్దేవా చేశారు. “రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మళ్లీ యూరియా కష్టాలు, కరెంటు కోతలు మొదలయ్యాయి. కరోనా సమయంలో కూడా రైతుబంధు వేసిన ఘనత కేసీఆర్ ది, అన్ని పథకాలను కష్టకాలంలో కూడా అమలు చేసిన ఘనత కేసీఆర్ ది. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ పాడు చేసింది. అసమర్ధ కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి నిరుద్యోగుల వరకు అన్ని వర్గాలు బాధ పడుతున్నాయి. విద్య నుంచి సంక్షేమ వరకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది అన్నారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి ఎప్పుడెట్లా ఉందో, ఇప్పుడెట్లా ఉందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ మోసం తప్ప మరేం చేయలేదు” అని కేటీఆర్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు – “ఉప ఎన్నికలు పెడితే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది. కానీ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. గద్వాల మునిసిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి.” అన్నారు. సభ సందర్భంగా భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





