అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

– క్రీడల్లో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి
– స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌పై సభ్యులతో ముఖ్యమంత్రి చర్చించారు. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఉండేలా సమీకృత క్రీడా కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియంను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇండోర్, ఔట్ డోర్ స్టేడియం, శిక్షణ పొందేందుకు అత్యాధునిక ప్రపంచస్థాయి మౌలిక వసతులతో గచ్చిబౌలి స్టేడియంను తీర్చిదిద్దాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ స్టేడియం నిర్మించాలన్నారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ అందించేలా శిక్షణ కేంద్రాలను నిర్మించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను బోర్డు సభ్యులకు వివరించారు. సీఎసఆర్ నిధులతో గచ్చిబౌలి స్టేడియంను అత్యద్భుతంగా అభివృద్ధి చేసేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని కోరారు. దేశంలోనే బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టే వారికి అవసరమైతే వారి బ్రాండింగ్‌ను ప్రోత్సహించుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. క్రీడల్లో హైదరాబాద్‌ను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నారు. జూన్ 2లోగా ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలిప్యాడ్ సహా అన్ని ప్రపంచస్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్ పోర్టు నుంచి క్రీడాకారులు నేరుగా హెలికాప్టర్‌లో స్టేడియంకు చేరుకునేలా ఏర్పాట్లు ఉండాలంటూ భవిష్యత్తులో స్టేడియం నిర్వహణకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే స్టేడియం అభివృద్ధికి సంబంధించి ఆర్కిటెక్చర్‌ను నియమించామని, అభివృద్ధిపై బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీర్ఘకాలంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమావేశంలో స్పోర్ట్స్ హబ్ సభ్యులు కొణిదెల ఉపాసన, కావ్య మారన్, సంజీవ్ గోయెంకా, సి.శశిధర్, క్రీడా శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ సోనీ బాలాదేవి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *